బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:00 PM
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బేబీ రుక్సానా తల్లికి ఆమె అర్హతకు తగిన ఉద్యోగం కల్పించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వారం రోజుల్లో ఉద్యోగం కల్పిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. చిన్నారికి పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు.
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బేబీ రుక్సానా ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Telangana Minister Damodar Rajanarsimha) ఆరా తీశారు. మంత్రి ఆదేశాలతో ఆయన కార్యాలయ అధికారులు శనివారం ఉదయం గాంధీ హాస్పిటల్‌కు వెళ్లి పాప, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ ఉషారాణితో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పాప ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పాపకు పుట్టుకతోనే పెద్ద పేగు సమస్య ఉందని, ఈ సమస్యకు చిన్నారికి పుట్టినప్పుడే నీలోఫర్‌లో సర్జరీ చేశారని ఉషారాణి తెలిపారు.
ఇటీవలే గాంధీలో పాపకు మరో సర్జరీ జరిగిందని, మరో మూడు నెలల తర్వాత ఇంకొక సర్జరీ చేయాల్సి ఉందని ఆమె వివరించారు. చిన్నారికి చికిత్స విషయంలో ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితుల వల్లే రుక్సానా తల్లి ఈ కఠిన నిర్ణయం తీసుకుందని ఉషారాణి తెలిపారు. కుటుంబ పరిస్థితులు, సరైన ఉపాధి లేకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాప తల్లి మంత్రి కార్యాలయ అధికారులకు తెలిపారు.
భర్త వదిలేసి వెళ్లిపోయాడని, అద్దె ఇంట్లో ఉంటూ, దొరికిన పని చేసుకుంటూ తానే ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటున్నానని రుక్సానా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఉపాధి కల్పించాలని ఆమె కోరగా, ఈ విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి సానుకూలంగా స్పందించారు. చిన్నారి తల్లికి గాంధీ హాస్పిటల్‌లోనే, ఆమె అర్హతకు తగిన ఉద్యోగం కల్పించాలని సూపరింటెండెంట్ ఉషారాణికి సూచించారు. పాపకు గాంధీలోనే పూర్తిస్థాయిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రుక్సానా తల్లికి వారం రోజుల్లో ఉద్యోగం కల్పిస్తామని ఉషారాణి భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మతో తెలంగాణ సంస్కృతి వైభవం చాటాలి: సీఎం రేవంత్‌రెడ్డి
మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. మల్లికార్జున ఖర్గే ధ్వజం
తమిళనాడు ఉప ఎన్నికల్లో సీఎం విజయ్ పార్టీ దూకుడు.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News