Share News

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:31 PM

ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని, ప్రజా శాంతికి భంగం కలగని చోట్ల మెట్రో, రైలు సేవలను యథావిధిగా నడపాలని, అనవసరమైన బారికేడ్లను తొలగించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 10న విధించిన ఆంక్షలపై వివరణాత్మక అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court

ఢిల్లీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో సీజేఐ కార్యకర్తలు, న్యాయవాదులపై పోలీసుల అణచివేత, నిర్బంధాలపై సుప్రీంకోర్టులో (Supreme Court) అత్యవసరంగా ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులు, న్యాయవాదులపై జరిగిన ఘటనలను తేలికగా తీసుకోబోమని హెచ్చరించారు. అందరి వాదనలు విని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. శాంతియుత నిరసన హక్కులను పోలీసులు హరిస్తున్నారని ధ్వజమెత్తారు. జంతర్ మంతర్ వద్దే కాకుండా, ఆ ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో కూడా పౌరులను, విద్యార్థులను, న్యాయవాదులను అకారణంగా అరెస్టు చేయడంపై సీనియర్ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


పోలీసుల తీరుపై న్యాయవాదులు తీవ్ర విమర్శలు..

ఈ క్రమంలో పోలీసుల తీరుపై న్యాయవాదులు తీవ్ర విమర్శలు చేశారు. నిరసనకారులపై అవసరానికి మించి విచక్షణారహితంగా బలప్రయోగం చేశారని, దేశ రాజధానిలో పరిస్థితులు ‘పోలీస్ స్టేట్’ను తలపించాయని పిటిషనర్లు వాదనలు వినిపించారు. ధర్మాసనం వెలుపల కూడా సెక్షన్ 144 విధించారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా సెక్షన్ 144 విధించడంపై న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ సేవలపై నిబంధనలు పెట్టడం చట్టానికి పూర్తి విరుద్ధమని దుయ్యబట్టారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ నిలిపివేయడంపై 'అనురాధ భాసిన్' తీర్పును పిటిషనర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జస్టిస్ బాగ్చి కీలక వ్యాఖ్యలు

ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించగా, ఆర్టికల్ 19(2) అనేది కేవలం నిషేధం కాదని, అది నియంత్రణకు (Regulation) సంబంధించినదని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ గుర్తుచేశారు. నిర్బంధాల తీవ్రత తమకు అర్థమైందని తెలిపారు. కేంద్రప్రభుత్వానికి అతీతంగా శాంతిభద్రతలను కాపాడే వ్యక్తిగత హక్కు పోలీసు అధికారులకు లేదని అన్నారు. జీవితం,స్వేచ్ఛ రెండూ సమానంగా సున్నితమైనవని చెప్పారు. తాము ఇదివరకే ఈ విషయం గురించి చెప్పామని, అది పోలీసు అధికారి అయినా, పౌరుడు అయినా అన్ని అంశాలపై తాము ఒక సంయుక్త ఉత్తర్వును జారీ చేస్తామని స్పష్టం చేశారు.

మాజీ సీఎంలను నిర్బంధించారు..

మాజీ సీఎంలతో సహా వేలాది మందిని ఢిల్లీ పోలీసులు నిర్బంధించారని పిటిషనర్లు ప్రస్తావించారు. ఈ నిరసనల్లో పాల్గొనకుండా మాజీ ముఖ్యమంత్రులు సహా 6,000 నుంచి 7,000 మందిని ముందస్తుగా నిర్బంధించడంపై సుప్రీంకోర్టులో పిటిషనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుపై స్పందన..

పోలీసులపై కూడా దాడి జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి పలువురు పిటిషనర్లు తీసుకువచ్చారు. ‘రాష్ట్రం కంటే పోలీసు అధికారులకు శాంతిభద్రతలను కాపాడే వ్యక్తిగత హక్కు లేదని... పౌరులైనా, పోలీసులైనా ప్రాణం, స్వేచ్ఛ సమానంగా సున్నితమైనవే’ అని జస్టిస్ బాగ్చి స్పష్టం చేశారు.


ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలి..

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా మెట్రో రైలు సేవలను వెంటనే యథావిధిగా నడపాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదుల విధులకు అడ్డంకులు సృష్టించవద్దని హుకుం జారీ చేసింది. ఏ ఒక్క లాయర్‌ను కూడా వారి వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.


ఆ బారికేడ్లను వెంటనే తొలగించాలి..

ఢిల్లీవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనవసరమైన బారికేడ్లను వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని హుకుం జారీ చేసింది. అక్టోబరు 10వ తేదీన ఏయే ఆంక్షలు విధించారు?, ఎందుకు విధించారు? అనే విషయాలపై వచ్చే వారం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం కోరింది. పబ్లిక్ ఆర్డర్ సమస్య లేనంతవరకు మెట్రో, రైలు సర్వీసులు యథావిధిగా నడపించాలని ఆదేశించింది. నిరసనల నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే పునరుద్ధరించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.


మధ్యంతర ఉత్తర్వుల కోసం కపిల్ సిబల్ వాదన..

శాంతియుత నిరసనలకు ఎలాంటి నిర్బంధాలు ఉండకూడదని, రైళ్లు సజావుగా సాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోరారు. ఈ పిటిషన్లపై సమాధానం దాఖలు చేయాలని కేంద్రానికి మంగళవారం వరకు సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది.

సొలిసిటర్ జనరల్ వాదనల తర్వాతే మధ్యంతర ఉత్తర్వులు..

ఎస్జీకి పిటిషన్ల కాపీలు అందలేదనే వాదన నేపథ్యంలో, ఆయన వాదనలు విన్న తర్వాతే మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది.


పిటిషనర్ల తరపున న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు..

అప్రకటిత అత్యవసర పరిస్థితి నడుస్తోందా..? అని న్యాయస్థానం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్- 358 ప్రకారం అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఆర్టికల్ 19 హక్కులను పరిమితం చేయొచ్చని, మరి ఇప్పుడు దేశంలో ‘ప్రకటించని ఎమర్జెన్సీ’ నడుస్తోందా..? అని కోర్టులో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు.


ఢిల్లీ వ్యాప్తంగా 45 నిర్బంధ కేంద్రాలు..

శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న యువత, ప్రతిపక్ష నాయకులు, ఎంపీలను ఇళ్లలోనే బారికేడ్లు పెట్టి నిర్బంధించారని, దేశవ్యాప్తంగా 45 డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వెల్లడించారు.

7,000 మందికి పైగా నిర్బంధం..

మెట్రో సేవలు నిలిపివేయడం, ఇంటర్నెట్ కట్ చేయడం వల్ల ఎంతమందిని అరెస్టు చేశారో కూడా అధికారికంగా తెలపట్లేదని, దాదాపు 7,000 మందిని నిర్బంధించారని న్యాయస్థానానికి మేనకా గురుస్వామి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర

జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్

203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 01:11 PM