ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Nov 16 , 2026 | 07:20 PM
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రైతులు తమ భూమిలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఖమ్మం జిల్లా, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రైతులు తమ భూమిలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈరోజు (సోమవారం) సత్తుపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చల్లగుళ్ళ నరసింహారావు పదవి స్వీకార కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, ప్రసంగించారు. రైతుకు తెలిసినంతగా శాస్త్రవేత్తలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు వ్యవసాయం గురించి తెలియదని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని అన్నదాతలు నష్టాలు రాకుండా పంటలు సాగు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొక్కజొన్న, శనగలు, జొన్నలు, సోయా, సన్‌ఫ్లవర్, ధాన్యం వంటి పంటలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులు తమ పంటలను జాగ్రత్తగా విక్రయించుకోవాలని సూచించారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా సాగునీరు అందించగలిగామని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. సత్తుపల్లికి ఏ ప్రాజెక్టు అడిగినా తన మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గానికి ఫుడ్ పార్క్, పామాయిల్ ఫ్యాక్టరీ, కిన్నెరసాని టూరిజం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తానని మాటిచ్చారు. బేతుపల్లి కాలువ ద్వారా వేంసూరు ప్రాంతంలోని చెరువులకు గోదావరి జలాలు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అవసరమైతే అంగార ప్రాంతానికి కూడా గోదావరి నీళ్లు తీసుకొస్తానని అన్నారు. సీతారామసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి ద్వారా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడం తన రాజకీయ జీవిత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాకు విమానాశ్రయం, భద్రాద్రికి రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్నది తన ప్రయత్నమని తెలిపారు. సత్తుపల్లి మీదుగా కొవ్వూరు, పెనుబల్లి మీదుగా కొండపల్లి రైల్వే మార్గాల కోసం కృషి చేస్తున్నానని అన్నారు.
మార్కెట్ కమిటీ నిధులను తిరిగి ఆయా మార్కెట్లే ఖర్చు చేసుకునే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి తుమ్మల భరోసా కల్పించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, సౌకర్యాలు కల్పించే బాధ్యత తనదని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సత్తుపల్లికి తీసుకొస్తానని మాటిచ్చారు. సీఎం చేతుల మీదుగా కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. అశ్వారావుపేటకు మంజూరైన పామాయిల్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే మట్టా రాగమయి విజ్ఞప్తితో కల్లూరు గూడెంకు మార్చామని స్పష్టం చేశారు. కల్లూరు గూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ రావడంతో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు ప్రారంభమైందని ప్రస్తావించారు. మరో 3 వేల ఎకరాల్లో పామాయిల్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పామాయిల్‌తో పాటు కోకో, మకాడమియా, వక్క, మిరియం వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. సత్తుపల్లి ప్రాంతంలో అధిక దిగుబడులు ఇచ్చే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అన్నారు. సత్తుపల్లి మార్కెట్ కమిటీకి అవసరమైన ఏ సౌకర్యమైనా కల్పించే బాధ్యత తనదని చెప్పారు. ఖమ్మం మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సత్తుపల్లి మార్కెట్ కమిటీని కూడా అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News