సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:55 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం లేఖ రాశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీలు, ఇతర కీలక వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Telangana CM Revanth Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ఈరోజు (ఆదివారం) లేఖ రాశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీలు, ఇతర కీలక వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు.
పారదర్శకంగా విచారణ జరగాలి..
ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పాటు, సజ్జనార్, రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపై ఆరోపణలు వచ్చినప్పటికీ, దర్యాప్తు పురోగతి, దాని దిశపై ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ దర్యాప్తు అసలు లక్ష్యం నుంచి పక్కదారి పట్టిందనే తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అప్పటి పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాత్రపైనా, ఈ కేసులోని అన్ని అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగిందా..? లేదా అన్నదానిపైనా అనేక ఆరోపణలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా ఈ అంశాలపై స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సజ్జనార్‌పై చర్యలు తీసుకోకుండా బదిలీ ఎందుకు చేశారు..
మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై అత్యంత తీవ్రమైన బహిరంగ వ్యాఖ్యలు చేసినట్లు తనకు సమాచారం ఉందని రాజాసింగ్ అన్నారు. పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీ ఎందుకు చేశారంటూ నాగేశ్వరరావు ప్రశ్నించినట్లు తనకు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ స్థాయి వ్యక్తి ఉన్న ఒక సీనియర్ పోలీసు అధికారిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని అన్నారు. గతంలో ఆ అధికారి నిర్వహించిన పదవులు, హోదాలతో సంబంధం లేకుండా ఈ ఆరోపణలపై నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
సజ్జనార్ ఆస్తుల విలువ సమంజసంగా ఉందా..?
సజ్జనార్ ఆస్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అక్రమాలపై విచారణ చేయాలని రాజాసింగ్ పట్టుబట్టారు. ఆయన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కూడా పలు ఆరోపణలు, బహిరంగ చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కర్ణాటకలోని సజ్జనార్ స్వగ్రామం పరిసర ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన నిధుల మూలాలు, యాజమాన్య వివరాలు, ప్రకటించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అన్నారు. ఆయనకు తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ సమంజసంగా ఉందా?, ఏవైనా నిబంధనలు ఉల్లంఘించారా..? అనే విషయాలను విచారణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్ధారించాలని రాజాసింగ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News