కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:58 PM
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై (Kishan Reddy).. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ.. తెలంగాణలో సేకరించినంతా ధాన్యం సేకరించలేదని తెలిపారు. అలాంటి బీజేపీ నేతలు ఇక్కడ యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలు చెప్పేవి అన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. ధాన్యం విషయంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని పదిసార్లు కలిశామని తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కోరామని.. కానీ కేంద్రం ఎందుకు కొనుగోలు చేయట్లేదని ప్రశ్నించారు. ఈరోజు (మంగళవారం) సచివాలయం వేదికగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రైతులపై బీజేపీ వైఖరి స్పష్టం అవుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ వడ్లకు డిమాండ్ లేదు..
తెలంగాణలోని వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అందుకే కేంద్రం ఇక్కడి వడ్లను కొనడానికి సుముఖంగా లేదని చెప్పుకొచ్చారు. తాము పండించిన 75లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి మరోసారి లేఖ రాస్తామని తెలిపారు. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ప్రోక్యూర్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంకా హార్వెస్ట్ అవుతుందని తెలిపారు. సివిల్ సప్లై కార్యాలయం నుంచి డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రైతులు, మహిళా సంఘాల అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు కేంద్రప్రభుత్వ నిధుల నుంచి రూ.170కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. 18 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొన్నామని తెలిపారు. క్వింటాకు రూ.1000ల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు.
పలు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి..
దేశంలో ఏ రాష్ట్రం కూడా బాధ్యతగా ధాన్యం కొనుగోలు చేయలేదని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. భవిషత్తులో పాడి ప్రోక్యూర్‌మెంట్‌లో ఏ విధంగా పోవాలనే అంశంపై.. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో హమాలీల సమస్య ఎక్కువగా ఉందని ప్రస్తావించారు. మోస్ట్ అడ్వాన్స్ మోడరైజేషన్ సిస్టం తేవాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న స్టోరేజ్ సరిపోవట్లేదని తెలిపారు. రేపు మేడిగడ్డలో మూడు బ్యారేజీల టెస్టింగ్ ప్రక్రియపై రివ్యూ చేస్తామని వివరించారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్‌ఏ అధికారులు చెప్పారని తెలిపారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే కొట్టకుపోతాయని ఎన్డీఎస్‌ఏ అధికారులు స్పష్టంగా చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి..
అలాగే, ఇరిగేషన్ శాఖకు సొంత విద్యుత్ వనరుల సృష్టిపై మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సౌర విద్యుత్ ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని హుకుం జారీ చేశారు. జలాశయాలు, కాలువలపై సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సూచించారు. పదిశాతం భూమి వినియోగంతో 6 వేల నుంచి 7 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని వివరించారు. మంజీరా, సింగూరు జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ అవకాశాలను పరిశీలించాలని నిర్దేశించారు. జాగోరా - చందోరా కాలువపై 20 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం పెట్టుబడి లేకుండానే బూట్ విధానంలో ప్రాజెక్టు ఏర్పాటుని ప్రతిపాదించిందని వివరించారు. ఏటా రూ.11.5 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఏటా రూ.6.2 కోట్ల ఆదా చేయడం సాధ్యమని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News