గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ABN , Publish Date - Jun 08 , 2026 | 08:30 PM
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోకి కేంద్రం నుంచి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ నిధులు ఎందుకు తీసుకురారు? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్8 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రోకి కేంద్రం నుంచి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ నిధులు ఎందుకు తీసుకురారు? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని నిలదీశారు. హైదరాబాద్‌కి సింగూరు జలాలను ఎందుకు తీసుకురానివ్వరు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గోదావరి జలాలు తీసుకొస్తే వారికేం ఇబ్బంది..? అని నిలదీశారు. గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు..? అని ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ మియాపూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC).. భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.1,674 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
ఐదు నగరాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి..
ప్రభుత్వానికి అండగా ఉంటామని మహిళలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్లే ఢిల్లీని పడావ్ పెట్టారని విమర్శించారు. ముంబైలో ట్రాఫిక్ జామ్, వర్షం వస్తే రోడ్లపైకే నీళ్లు వస్తాయని తెలిపారు. స్లమ్స్‌లో సదుపాయాలు లేక ముంబైలో నివసించే పరిస్థితి లేదని చెప్పారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్‌కు కంపెనీలు వచ్చాయని ప్రస్తావించారు. ఎయిర్‌పోర్టుకు ఎన్నిగంటల్లో చేరుకుంటామో కూడా చెప్పలేమని అన్నారు. గతేడాది వారంపాటు నీళ్లలోనే చెన్నై ఉందని వివరించారు. కోల్‌కతా శాంతిభద్రతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదని తెలిపారు. ఐదు నగరాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఒక్కటే నగరంగా ఉంటే అనేక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పరిపాలనలో సమస్యలు తలెత్తకుండా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. అమెరికా సిలికాన్ వ్యాలీతో మన సైబరాబాద్ పోటీపడుతోందని ఉద్ఘాటించారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలి..
గ్రేటర్ చుట్టూ నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణలో 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారని తెలిపారు. మెట్రో, మూసీ ప్రక్షాళనకు అనుమతులు ఎందుకు తేవట్లేదని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి ఎంత లడాయి మనిషి అనేది అందరికీ తెలుసునని విమర్శించారు. కిషన్‌రెడ్డి డ్రామాలు ఆపాలని ఎద్దేవా చేశారు. తెలంగాణతో మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా.. అడ్డుకుంటున్నది బీజేపీనేనని ఆగ్రహించారు. సబర్మతి అద్భుతమన్న బీజేపీ నేతలు.. మూసీ ప్రక్షాళన చేయరా..? అని ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత ఒకాయన ఫామ్‌హౌస్‌కు వెళ్లారని విమర్శించారు. పదేళ్లపాటు కేసీఆర్, 12 ఏళ్లలో మోదీ ఏం చేశారో అసెంబ్లీలో చర్చిద్దామని.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎకరం రూ.200 కోట్లు పలుకుతున్న ప్రాంతంలో మౌలిక వసతులు అవసరమని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ఆఫీస్‌ల మాదిరిగానే కార్పొరేషన్ ఆఫీస్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో లక్ష LIG, MIG ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎక్కడ నివసించేవారికి అక్కడే ఇళ్లు కట్టి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి
నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News