Share News

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:17 PM

22A భూములపై అసెంబ్లీలో చర్చిద్దామని.. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. 22A అడ్డుపెట్టుకుని దందాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి..  బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్
Telangana MINSTER Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): 22A భూములపై అసెంబ్లీలో చర్చిద్దామని.. బీఆర్ఎస్ నేతలు సభలో ఏం మాట్లాడతారో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Telangana MINSTER Ponguleti Srinivas Reddy) సవాల్ చేశారు. 22A భూములను అడ్డుపెట్టుకుని దందాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిపక్ష పాత్రను విస్మరించాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వెయ్యి రోజులు పూర్తి చేసుకుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలు తాము చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. యాస, భాషలతో ప్రజలను మభ్య పెట్టలేరని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ బకాయిలను తామే చెల్లించామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌లకు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని పేర్కొన్నారు.


వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చాం..

‘మా పాలనలోని వెయ్యి రోజుల్లో రూ.1.76లక్షల కోట్లను రైతులకు ఇచ్చాం. ఆనాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారు.. మేము వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చాం. ప్రజలను కావాలని మా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్‌కు జ్ఞానోదయం కాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా గులాబీ పార్టీకి ఙ్ఞానం రాలేదు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడించాం. అయినా వారిలో మార్పు రాలేదు. ఆనాడు బతుకమ్మ చీరల్లో అవినీతికి పాల్పడ్డారు. రాహుల్ గాంధీని విమర్శస్తావా కేటీఆర్..?. సంస్కార హీనంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. అధికారంలోకి వస్తామని మీరు కలలు కంటూనే ఉండండి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మేము నిర్మిస్తున్నాం. హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాం. టీమ్స్‌పై బీఆర్ఎస్ నిస్సిగ్గుగా మాట్లాడుతోంది. నిరసన తెలిపేందుకు అవకాశం లేకుండా ధర్నాచౌక్ ఎత్తేసిన మీరా.. స్వేచ్ఛ గురించి మాట్లాడేది. కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహించారు.


కొత్తగా మూడు లక్షల పెన్షన్లు ఇస్తాం..

‘మీ 3,475 రోజుల పాలన కంటే, మా వెయ్యి రోజుల పాలనే బాగుందని ప్రజలు చెబుతున్నారు. మీరు పేదలకు ఇళ్లు ఇచ్చారా?, రేషన్ కార్డులు ఇచ్చారా?. కొత్తగా మరో మూడు లక్షల పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఖమ్మంలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని కేసీఆర్ అన్నారు. భద్రాచలం రాములోరి గుడికి రూ.1000 కోట్లు ఇస్తానని దేవుడినే మోసం చేశారు. మా మేనిఫెస్టోలో పెట్టినవన్నీ మేము ఇంకా పూర్తి చేయలేదు. ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తాం. కోర్ ప్రాంతంలో మేము డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నాం. విలువైన భూములను పేదలకు ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. మీరు ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి అసెంబ్లీ వరకు పొర్లు దండాలు పెట్టినా మేము పేదలకు ఇళ్లు కట్టించి తీరుతాం. నేను వాస్తవాలు చెబితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం. ధరణితో మీరు కొల్లగొట్టిన భూములపై విచారణ జరుగుతోంది. మీరు ఏం వ్యాపారం చేశారని.. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..?. మీ బండారం శకుని మామ కూతురు దగ్గర ఉంది. ముందు దానికి సమాధానం చెప్పండి’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ చేశారు.


మీ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి..?

‘సొంత ఆడబిడ్డకు న్యాయం చేయని మీరు పేద ఆడపడుచులకు న్యాయం చేస్తారా?. ఎంతమంది దళితులకు భూములు ఇచ్చారు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు. మీ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి.?. ఈ రాష్ట్రాన్ని కొల్లగొడితే మీకు వచ్చిన డబ్బులు కావా?. దేశంలోనే రిచెస్ట్ ధనిక పార్టీ ఎలా అయింది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన పాత్ర పోషించకపోవడం దురదృష్టం. ముసుగు తీసి బయటకొస్తే గులకరాళ్లతో కొడతారని భయమా..?. ప్రజల ఇబ్బందులపై మంచి సూచనలు ఇవ్వొచ్చు కదా?. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు అనర్హులు. మీరు బీజేపీతో జత కట్టారని కవిత చెప్పింది నిజమే అనిపిస్తోంది. ముందు మీ ఇళ్లు చక్కపెట్టుకోండి. ఉస్మానియా యూనివర్సిటీకి మేము చేస్తామన్నది కచ్చితంగా చేస్తాం’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 05:06 PM