బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్, హరీశ్‌రావు భావోద్వేగ ట్వీట్లు
ABN , Publish Date - Apr 27 , 2026 | 10:54 AM
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, భవిష్యత్తు ఆశయాలను ప్రతిబింబించాయని వారు తెలిపారు. ఒకవైపు ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ, మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేశారు. ఈ పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయ యవనికపై అలుపెరుగని పోరాట పటిమతో, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన భారత రాష్ట్ర సమితి (BRS) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుని, 26వ ఏట అడుగుపెడుతోంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఆ పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్‌ది ఓ విప్లవం: కేటీఆర్
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని.. ఓ విప్లవమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తన సందేశంలో బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఒక మహోజ్వల విప్లవంగా అభివర్ణించారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండాగా, స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం నేటికి 25 వసంతాల మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల సందర్భంగా కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక విప్లవమని, తెలంగాణ అస్తిత్వం కోసం మళ్లీ పునరంకితం కావాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ, కేసీఆర్ నాయకత్వ ప్రాముఖ్యాన్ని హరీశ్‌రావు వివరించారు. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసిన ధిక్కార వేదిక బీఆర్ఎస్ అని, ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిందని కొనియాడారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అడుగంటిందని, అరాచకం తాండవిస్తోందని ఆరోపించారు. ప్రజల గుండెల్లో ఇప్పుడు ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం మార్మోగుతోందని తెలిపారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు దగ్గరలోనే ఉందని, గులాబీ జెండా సగర్వంగా మళ్లీ ఎగురుతుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు
Read Latest Telangana News And AP News And International News And Telugu News