నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:38 PM
ప్రముఖ సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి(Ashu Reddy), ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) పోలీసులు.. అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి సహా వారి కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లండన్‌లో ఉంటున్న ధర్మేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి భారీ మొత్తంలో నగదు, బంగారం వసూలు చేసిందని బాధితుడి తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసులోని ప్రధాన ఆరోపణలు ఇవే..
పెళ్లి చేసుకుంటాననే నమ్మకంతో ధర్మేంద్ర నుంచి 5 కిలోల బంగారం, అలాగే ఉండటానికి ఫ్లాట్ కావాలని చెప్పి రూ.3 కోట్ల విలువైన విల్లాకు అడ్వాన్స్ ఇప్పించుకున్నట్లు సమాచారం. మొత్తమ్మీద రూ.9.83 కోట్ల విలువైన సొత్తును అషురెడ్డి కాజేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి పెళ్లి విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ఇరు కుటుంబాలు జాతకాలు కూడా చూపించుకున్నాయని, అన్నీ కుదిరాయని నమ్మించి ధర్మేంద్రను బుట్టలో వేసుకున్నారని బాధితుడి తండ్రి ఆరోపించారు. ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత, డబ్బులు తిరిగి ఇవ్వలేదని మళ్లీ పెళ్లి చేసుకుంటానని రెండోసారి కూడా ధర్మేంద్రను నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అషురెడ్డి తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి ఈ డ్రామా ఆడిందని, వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని 'హనీట్రాప్' చేసిందని బాధితుడి తండ్రి ఫిర్యాదు కాపీలో వివరించారు. అషురెడ్డి సోదరి దివ్యారెడ్డి కూడా ఈ వ్యవహారంలో భాగస్వామి అని, ఆమెకు కూడా ధర్మేంద్ర రూ.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రివర్స్ కేసు పెడతానని బెదిరింపులు..
డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే, ఇస్తానని చెప్పడం పోయి.. ఎదురుగా తనపైనే కేసు పెడతానని అషురెడ్డి బెదిరింపులకు పాల్పడిందని బాధితుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో చేసేదేమీ లేక వారు పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అషురెడ్డి ఫ్యామిలీపై బీఎన్ఎస్ 318(4) r/w 3(5) సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అషురెడ్డి ఏమన్నారంటే..
ఛీటింగ్ ఆరోపణలపై నటి అషురెడ్డి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. పెళ్లి పేరుతో రూ.9.83కోట్లు కాజేశాననేది అవాస్తవమని చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని అషురెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News