ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:43 PM
ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపామని ప్రస్తావించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీని మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మె సమయంలోనే కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపామని, వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరించామని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు. అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కార్మికుల చిరకాల స్వప్నమని, దాన్ని తాము నెరవేర్చామని పేర్కొన్నారు.
మిగిలిన సమస్యలనూ పరిష్కరిస్తాం..
అలాగే కార్మిక సంఘాల ఎన్నికలు, 11శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి అంశాలపై ఆర్టీసీ సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నిర్ణయాలను చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ కార్మికులు సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించారని.. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కేడర్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుమారు 15 గంటలపాటు కార్మికులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. ఇంకా మిగిలిన సమస్యలనూ కూడా దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేసినా, వారి డిమాండ్లు నెరవేర్చలేదని విమర్శించారు.
మా ప్రభుత్వానికి కార్మికులతో విభేదాలు లేవు..
ఆ సమయంలో 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి కార్మికులతో విభేదాలు లేవని, వారిని కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని చెప్పారు. సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ శవ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. 2013 బాండ్లు, 2017 పీఆర్సీ, డీఏలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిల చెల్లింపులు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగాల భర్తీ, కారుణ్య నియామకాలు వంటి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే సర్వీసు నుంచి తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నామని ప్రస్తావించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తున్నారని తెలిపారు. పేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ఆర్టీసీ ఒక లైఫ్ లైన్‌లా పనిచేస్తోందని మంత్రి పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు
మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
Read Latest Telangana News And AP News And International News And Telugu News