అనంతపురంలో అమానుషం.. ఆరేళ్ల చిన్నారిపై వైసీపీ నేత అఘాయిత్యం
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:43 AM
అనంతపురం నగరంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక చిన్నారిపై జరిగిన అకృత్యం, ఆపై నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
అనంతపురం జిల్లా, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): అనంతపురం నగరంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక చిన్నారిపై జరిగిన అకృత్యం, ఆపై నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అనంతపురం అర్బన్ పరిధిలోని రుద్రంపేటలో దారుణ ఘటన వెలుగుచూసింది. వైసీపీ అండతో ఒక కామాంధుడు చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, నిందితుడికి స్థానికులు అక్కడికక్కడే శిక్ష విధించగా.. పోలీసులు నిందితుడిని వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఘటన నేపథ్యమిదే..
రుద్రంపేటలో నివసించే ఆరేళ్ల బాలికపై వైసీపీ నేత ఖాజా హుస్సేన్ అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం వెలుగుచూసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుణ్ని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి, దేహశుద్ధి చేశారు. గుండు కొట్టించి, ముఖానికి రంగు పూసి వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
పోలీసులు కేసును నీరుగార్చారా.?
నిందితుడిని అప్పగించినప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు వైసీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ చేసేందుకు యత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాల్సింది పోయి, మతిస్తిమితం లేదని కేసును పక్కదోవ పట్టించేప్రయత్నం చేశారని స్థానికులు మండిపడ్డారు.