Share News

జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:59 PM

వైసీపీ హయాంలో జగనన్న లే అవుట్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నివాస యోగ్యం లేని, సముద్ర తీర భూములను కొనుగోలు చేసి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు.

జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జగనన్న లే అవుట్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) ఆరోపించారు. నివాస యోగ్యం లేని, సముద్ర తీర భూములను కొనుగోలు చేసి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో నివాస యోగ్యం లేని స్థలాలను పేదలకు కేటాయించారని.. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆగ్రహించారు. వైసీపీ హయాంలో మచిలీపట్నంలోని కరగ్రహారం గ్రామంలో జగనన్న కాలనీని ఏర్పాటు చేసింది. 300 ఎకరాల్లో జగనన్న లే అవుట్‌ను ఏర్పాటు చేసి 16వేల ఇళ్ల స్థలాలు కేటాయించింది. కనీస సౌకర్యాలు లేకపోవటంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఈరోజు (శనివారం) ఆ కాలనీలో పర్యటించి వసతులు, సౌకర్యాలను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు.


సెంటు స్థలంలో నిర్మించిన ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో మంత్రి రవీంద్ర మాట్లాడారు. కనీస వసతులు లేవని మంత్రి వద్ద లబ్ధిదారులు వాపోయారు. చౌడు భూములు కావడంతో పెద్ద మొత్తంలో నిర్మాణ వ్యయమైందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కాలనీలో వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు చేపట్టకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు నిర్మాణాల కోసం ముందుకు రాకపోతే ఆ స్థలాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


జగన్ హయాంలో ఈ కాలనీని నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇళ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులు ముందుకు రాలేదని మంత్రి చెప్పుకొచ్చారు. రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన కాలనీల్లో సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కాలనీలో కనీస వసతుల కల్పనకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ కాలనీలో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 06:11 PM