రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 08:07 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు.
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు. ఈ రోజు (శనివారం) ముంబైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు. అవార్డు స్వీకరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఏపీలో అనుమతుల వేగాన్ని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలని కోరారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దేశంలో సంస్కరణలు అమలవుతున్నాయని.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని తెలిపారు. ఇది పెట్టుబడులకు కూడా మెరుగైన సమయమని చెప్పుకొచ్చారు.
సుపరిపాలన అందిస్తున్నాం..
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమి లాంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయం సరైనదేనని వ్యాఖ్యానించారు. లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశం కల్పించేందుకు తీసుకువచ్చిన బిల్లు ఇదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో నారీ శక్తి బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని ప్రస్తావించారు. నారీ శక్తి బిల్లు అమలైతే మహిళలకు, పురుషులకు ఎక్కువ అవకాశాలు దక్కి ఉండేవని తెలిపారు.
పెట్టుబడులను మోదీ ప్రోత్సహిస్తున్నారు..
ఈ బిల్లు అమలు చేయకపోవడంతో మహిళలు అవకాశాలు కోల్పోయారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశంలోని మహిళలంతా గట్టిగా సంకల్పిస్తే ఈ బిల్లు ఎలాగైనా అమలు అవుతుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగతిశీల ఆలోచనలు ఉన్న నాయకుడని అభివర్ణించారు. నిబంధనలను సరళీకృతం చేస్తూ పెట్టుబడులను మోదీ ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తేనే సంపద సృష్టి జరుగుతుందని వెల్లడించారు. మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణను గట్టిగా అమలు చేశామని వివరించారు.
పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందించాం..
ఇప్పుడు జనాభా కొరతను ఎదుర్కొంటున్నామని సీఎం వ్యాఖ్యానించారు. అందుకే ఈ జనాభా నిర్వహణ ప్రక్రియను చేపట్టాలనే పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందించామని స్పష్టం చేశారు. డబ్బులు ఉంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు పెట్టవచ్చని. కానీ భవిష్యత్తులో జనాభాను సాధించలేమని చెప్పుకొచ్చారు. భారత ఫెర్టిలిటీ రేటు 1.9 శాతం ఉందని.. ఏపీలో అది 1.5 శాతం మాత్రమే ఉందని.. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్తులో జనాభా ఉన్న దేశాలే అత్యంత సంపన్న దేశాలుగా మారుతాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకువచ్చి అమలు చేయాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్
బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ
Read Latest AP News And Telangana News And International News And Telugu News