మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:05 PM
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.
హైదరాబాద్, మార్చి 21(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేయడం ఇప్పుడు నేరగాళ్లకు పరిపాటిగా మారింది. తాజాగా హైదరాబాద్‌లో ఒక ఉన్నత స్థాయి మహిళా వ్యాపారవేత్త (మాజీ డీజీపీ మనుమరాలు)ని భారీగా మోసగించారు. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మోసం ఎలా జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఈ నెల 13న మహిళా వ్యాపారవేత్త పేరు, ఫొటోతో ఒక ఫేక్ వాట్సాప్ అకౌంట్ సృష్టించారు. ఆ అకౌంట్ నుంచి ఆమె సంస్థలో పనిచేసే అకౌంటెంట్‌కు మెసేజ్ పంపించారు. ‘మీటింగ్‌లో ఉన్నానని.. వెంటనే ఈ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయండి’ అంటూ తెలిపారు. ఆ సందేశాన్ని నిజమని నమ్మిన అకౌంటెంట్ ఎలాంటి అనుమానం లేకుండా ఒకే ట్రాన్సాక్షన్‌లో రూ.1.20 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు.
మోసం బయటపడిందిలా..
ఈ మోసం వెంటనే బయటపడలేదు. ఈ నెల 17వ తేదీన అదేవిధంగా మరోసారి మెసేజ్ వచ్చింది. ఈసారి డబ్బులు పంపేముందు అకౌంటెంట్ చెక్ అప్రూవల్ కోసం మహిళా వ్యాపారవేత్తను సంప్రదించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. ‘నేను ఎలాంటి డబ్బు పంపమని చెప్పలేదు’ అని ఆమె చెప్పడంతో ముందే జరిగిన ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకుని ఆ మహిళా షాక్‌కు గురయ్యారు. బాధితురాలు ఒక ప్రముఖ మహిళ వ్యాపారవేత్త. ఆమె మొత్తం 18 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. మాజీ డీజీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలీసుల చర్యలు..
మోసం తెలిసిన వెంటనే బాధితురాలు 1930 నంబర్ ద్వారా సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ విచారణలో భాగంగా కేరళకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి.
ప్రజలకు సూచనలు..
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల రూ.1.20 కోట్ల భారీ నష్టం జరిగిందని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమని మెసేజ్ వస్తే తప్పనిసరిగా కాల్ చేసి నిర్ధారించాలని సూచించారు. వాట్సాప్ మెసేజ్‌లను నమ్మకూడదని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని అన్నారు. పెద్ద మొత్తాల లావాదేవీలకు డబుల్ వెరిఫికేషన్ తప్పనిసరని తెలిపారు. అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి గోరి కట్టారు: హరీశ్‌రావు
పది పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే
Read Latest Telangana News And AP News And International News And Telugu News