హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే
ABN , Publish Date - Mar 20 , 2026 | 09:00 PM
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మాదాపూర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మార్చి 19న పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది.
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భాగంగా, మాదాపూర్ పోలీసులు తాజాగా ఒక భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. పక్కా సమాచారంతో జరిపిన ఈ దాడిలో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి, సుమారు రూ.4.5 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 19వ తేదీన మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ రోడ్డులో కొందరు వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడి వివరాలిలా..
అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన పరుసముల దినేశ్(28) గా గుర్తించారు. వృత్తిరీత్యా కారు మెకానిక్ అయిన దినేశ్, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ డ్రగ్స్ దందాలోకి దిగినట్లు తెలుస్తోంది.
184 ప్లాస్టిక్ డబ్బాల్లో..
నిందితుడి వద్ద తనిఖీలు చేయగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన డ్రగ్స్ బయటపడ్డాయి. సుమారు 920 గ్రాముల వీడ్ ఆయిల్ (హ్యాష్ ఆయిల్) స్వాధీనం చేసుకున్నారు. 184 చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ ఆయిల్‌ను నింపి సిద్ధంగా ఉంచారు. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 4.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
పోలీసుల దర్యాప్తు..
మాదాపూర్ పోలీసులు నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..?, వీటిని ఎవరికి విక్రయించేందుకు ప్లాన్ చేశారు..?, ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
ఐటీ కారిడార్‌లో హై అలర్ట్
మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల్లో యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతోండటంతో పోలీసులు నిఘాను మరింత కఠినతరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News