ఫోన్ ట్యాపింగ్ కేసు.. దోషులను జైలుకు పంపాలి: ఎంపీ రఘునందన్ రావు
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:50 PM
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసుపై(Phone Tapping Case) బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు (BJP Medak MP Raghu nandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలోనే పూర్తి కావాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు. తప్పు చేసినవారు కొడుకైనా, కూతురైనా జైలుకు పంపుతానని.. 2014 జూన్‌లో మాజీ సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడారని ప్రస్తావించారు రఘునందన్. ఆ మాటలు.. కేసీఆర్‌కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారంలో రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు.
గజ్వేల్ అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ పాత్ర లేదు..
గజ్వేల్ అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఏమీ లేదని బీజేపీ ఎంపీ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ తాను పోటీచేసిన గజ్వేల్‌కు 'గడ' అని పేరు పెట్టారని.. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు 'కుడ' అని పేరుపెట్టారు తప్ప.. ఆ నియోజకవర్గాల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పులూ లేవని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ అభివృద్ధికి నోచుకోలేదని, రెండేళ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌కు మూడు హై స్పీడ్ రైళ్లు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విమర్శించే మూర్ఖులంతా అంధులేనని ఎంపీ రఘునందన్ విమర్శించారు. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సున్నా అని ఒక్కొకరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఒక తీరుగా వ్యాఖ్యానిస్తున్నారు. బడ్జెట్‌పై ఒక దిక్కు కేటీఆర్.. ఇంకో దిక్కు హరీశ్‌రావు, కవిత మాట్లాడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి 7 హైస్పీడ్ రైళ్లు కేటాయిస్తే అందులో హైదరాబాద్‌కు మూడు హైస్పీడ్ రైళ్లు కేటాయించడం జరిగింది. ఈ విషయం.. బావబామ్మర్దులకు కనిపించడం లేదా? గత బడ్జెట్ కంటే రైల్వే రంగానికి ఈసారి 15 శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు సున్నా అని చెబుతున్నరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓసారి బడ్జెట్‌ను పరిశీలించాలి. గతంలో కంటే ఈసారి రూ.1300 కోట్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేటాయించారు’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి
Read Latest Telangana News And AP News And Telugu News