తెలంగాణకు ‘మెడికల్ టూరిజం హబ్’!
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:10 AM
దేశంలో ఐదు రీజినల్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణకు ఒకటి దక్కే అవకాశముందని వైద్య వర్గాలంటున్నాయి.
కేంద్రం ప్రకటించిన ఐదింటిలో ఒకటి దక్కే అవకాశముందంటున్న వైద్య వర్గాలు
ఫ్యూచర్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఐదు రీజినల్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణకు ఒకటి దక్కే అవకాశముందని వైద్య వర్గాలంటున్నాయి. దేశాన్ని ప్రధాన వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో 5 చోట్ల మెడికల్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈవన్నీ కూడా సమగ్ర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా సేవలందిస్తాయని.. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది. అయితే ఫ్యూచర్ సిటీలో మెడికల్ టూరిజాన్ని వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అది కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటుకు అవకాశాలున్నాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈసారి కేంద్ర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం), ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలకు నిధులు పెరిగాయి. ఎన్‌హెచ్‌ఎంకు ఈసారి 6.2ు నిధులు పెంచి రూ.39,390 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆమేరకు రాష్ట్రానికి అదనంగా రూ.90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.500 కోట్లు పెంచి మొత్తంగా రూ.9,500 కోట్లు కేటాయించడంతో తెలంగాణకు వచ్చే నిఽధులు కూడా పెరగనున్నాయి. ఇటు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాని (ఎన్‌ఏసీపీ)కి రికార్డు స్థాయిలో నిధులు పెంచారు. గతేడాది రూ.2,661 కోట్లుండగా, ఏకంగా 30.6ు పెంచి రూ.3,477 కోట్లు కేటాయించారు. దీంతో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీకి సైతం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) నుంచి నిధులు పెరగనున్నాయి. ఇక సీజీహెచ్‌ఎస్ కింద పెన్షనర్ల వైద్యానికి కేటాయింపులు 7.5ు పెరిగి రూ.6,340 కోట్లకు చేరాయి. దీంతో పెన్షనర్లకు ఊరట లభించనుంది.