ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:39 PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను.. సిట్ సుమారు నాలుగున్నర గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు (PhoneTapping Case) విచారణ కీలక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈరోజు(ఆదివారం) సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన ఈ విచారణలో కేసీఆర్‌కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కేసీఆర్‌ను నాలుగున్నర గంటలకుపైగా సిట్ అధికారులు ప్రశ్నించారు.
ఆ ఆధారాలతో విచారించిన సిట్..
నందినగర్ నివాసంలో కేసీఆర్‌ను ఆరుగురు అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణని ముగించుకున్న అనంతరం కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయనే విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..
ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా..? అని కేసీఆర్‌ని నేరుగా ప్రశ్నించారు. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా?’ అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది..? అనే విషయాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు.
వారి ఫోన్లు ట్యాప్ చేశారా..?
‘ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు?, అది సాధారణ భద్రత కోసమా..? లేక రాజకీయ అవసరాల కోసమా..?’ అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా..?.. వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా..? అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించారని సమాచారం. ఈ ప్రశ్నలపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో తమ దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ప్రభాకర్‌రావు పదవీకాలంపై విచారణ..
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీకాలం ముగిసిన ప్రభాకర్‌రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు..? ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి..? అంటూ కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు..?, పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు..?, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ‘మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది?, ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా..? అనే అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్‌తో ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు..? చేశారా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ ఫండ్‌ను కేటాయించారా..? ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు..? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణ..
ఈ విచారణలో అత్యంత సంచలనంగా మారిన ప్రశ్న ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘మీ పార్టీకీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లిస్ట్‌లో ఎందుకు ఉన్నాయి? అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై కేసీఆర్ వివరణ కోరుతూ అధికారులు తీవ్రంగా విచారణ చేసినట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ చేశారా..?
మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు..?, ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి..? , భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా..? అనే అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ వయస్సు రీత్యా నందినగర్‌లో విచారణ..
కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాల దృష్ట్యా, సిట్ అధికారులు ఆయన నివాసంలోనే విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ సమయంలో మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్‌రావు, న్యాయ నిపుణులు నందినగర్ నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
రాజకీయంగా పెరుగుతున్న వేడి..
కేసీఆర్‌పై సిట్ అధికారుల విచారణ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపే అంటూ ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News