Share News

హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:22 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లతో, ఇతర డెలిగేషన్లతో చివరి రోజు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రతిపాదించడంలో విద్యార్థులు తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలని, ఈ విజన్‌ను ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు..

హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..
Telangana CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హార్వర్డ్ విశ్వవిద్యాలయ పర్యటన ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. ఒక విద్యార్థిలా మారి ఆయన నేర్చుకున్న తీరు, అక్కడి విద్యార్థులతో ఆయన జరిపిన సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన దిగ్విజయంగా ముగిసింది. 'లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ' అనే ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన సీఎం, చివరి రోజున హార్వర్డ్, MIT, కొలంబియా యూనివర్సిటీలకు చెందిన భారతీయ విద్యార్థులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.


విద్యార్థులతో ముఖాముఖి..

నాయకత్వంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘మీకు నాయకత్వ పాఠాలు చెప్పడానికి ఇక్కడ ప్రొఫెసర్లే ఉత్తమ గురువులు. నేను కేవలం నా అనుభవాలను పంచుకోవడానికి వచ్చాను. బోధన కంటే సంభాషణ ద్వారానే ఎక్కువ నేర్చుకోవచ్చు’ అని సీఎం స్పష్టం చేశారు. భారతదేశం, తెలంగాణ భవిష్యత్తుపై తాను చాలా ఆశాజనకంగా ఉన్నానని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


'తెలంగాణ రైజింగ్ 2047' విజన్..

సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను విద్యార్థులకు వివరించారు. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగడమే లక్ష్యమని వివరించారు. పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధి, రైతులకు భరోసా, మహిళా సాధికారత అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. హార్వర్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై చదువుతున్న విద్యార్థులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ‘హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి మీ నైపుణ్యాన్ని ఉపయోగించండి. మన రాష్ట్ర అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు మారాలి’ అని కోరారు. సీఎం విజన్‌కు ప్రభావితమైన విద్యార్థులు, తాము కచ్చితంగా తెలంగాణ అభివృద్ధి, స్టార్టప్ రంగానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


విద్యా ప్రమాణాల పెంపుపై చర్చలు..

క్లాసుల విరామ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ వైస్ ప్రొవోస్ట్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్‌లీ, కెన్నెడీ స్కూల్ డీన్ జెరెమీ వైన్‌స్టెయిన్‌లతో సమావేశమయ్యారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడానికి హార్వర్డ్ సహకారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సిట్ విచారణకు కేసీఆర్..?

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 06:40 PM