అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:10 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సిట్(స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్) విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు(KCR) సిట్ అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) స్పందించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి నోటీసుల డ్రామా..
’తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి.. పైశాచిక ఆనందం పొందడం దారుణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఆ రూల్‌ను పోలీసులు అతిక్రమిస్తున్నారు..
ఇది కేవలం ‘పైశాచిక ఆనందం’ పొందడమేనని కేటీఆర్ విమర్శించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు ఉంటున్న నివాసం వద్దే విచారించాలనే కనీస నిబంధనను పోలీసులు అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) మీద అవగాహన ఉందా? లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చట్టం, న్యాయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తోన్న ప్రతి తప్పుడు పనిని ప్రజల ముందు పెడతామని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News