Share News

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

ABN , Publish Date - Jan 31 , 2026 | 10:13 AM

ముషీరాబాద్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్‌ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Matrimonial Scam

హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌లో సైబర్ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. చదువుకున్న వారు, రైల్వే ఇంజినీర్ వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా వీరి మాయమాటలకు మోసపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు(Matrimonial Scam) సైబర్ నేరగాళ్లకు ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ పరిధిలో ఓ దారుణమైన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వేలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి.. పెళ్లి పేరుతో పరిచయమైన యువతి చేతిలో ఏకంగా రూ.54 లక్షలు పోగొట్టుకున్నాడు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో జరిగిన ఈ భారీ స్కామ్ వివరాలిలా ఉన్నాయి.


పరిచయంతో మొదలై భారీ మోసం దాకా..

బాధితుడు తన వివాహం కోసం ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అక్కడ ఒక యువతి పరిచయమైంది. నమ్మకం కలిగేలా అతనితో మాట్లాడి నిట్టనిలువునా ముంచింది. కొద్దిరోజులు ఫోన్‌లో సంభాషించిన తర్వాత, తాను క్రిప్టో కరెన్సీ ద్వారా భారీగా లాభాలు గడిస్తున్నానని బాధితుడికి ఆశ చూపింది. అమెను గుడ్డిగా నమ్మిన ఇంజినీర్.. ఆమె పంపిన లింకుల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. లాభాలు వస్తున్నట్లు స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో బాధితుడు ఏకంగా 29 విడతల్లో వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.54 లక్షలు బదిలీ చేశాడు.


అసలు రంగు బయటపడిందిలా..

తాను పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చాయని భావించిన బాధితుడు.. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ డబ్బు తీయాలంటే మరికొంత 'అదనపు ఫీజు' చెల్లించాలని సదరు యువతి, వెబ్‌సైట్ నిర్వాహకులు కోరారు. అప్పటికే భారీగా నష్టపోయిన బాధితుడు, తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


తగిన జాగ్రత్తలు పాటించాలి..

సైబర్ భద్రత కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమైన వారు వెంటనే డబ్బు, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలన్నారు. అనధికారిక వెబ్‌సైట్లు లేదా వాట్సాప్ లింకుల ద్వారా వచ్చే క్రిప్టో ట్రేడింగ్ ఆఫర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పెళ్లి సంబంధాల కోసం చూసేటప్పుడు అవతలి వ్యక్తి నేపథ్యాన్ని పూర్తిగా విచారించిన తర్వాతే ముందడుగు వేయాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 12:05 PM