ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:24 PM
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. దొంగలు ఎంత చాకచక్యంగా చోరీ చేస్తున్నారనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది..
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. దొంగలు ఎంత చాకచక్యంగా చోరీ చేస్తున్నారనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఓ దొంగ కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒక కొత్త హోండా యాక్టివా వాహనాన్ని చోరీ చేశాడు.
అసలు ఏమైందంటే..
బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఒక వ్యక్తి తన హోండా యాక్టివా వాహనాన్ని ఒక షాపు ముందు పార్క్ చేశాడు. వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లిన అతను.. తిరిగి వచ్చేసరికి తన వాహనం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన వాహనాన్ని కొనుగోలు చేసి కేవలం రెండు రోజులు మాత్రమే అయిందని ఫిర్యాదులో తెలిపారు. కొత్త బండి కొన్నానని సంతోషపడే లోపే.. చోరీ కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.
15 సెకన్లలో చోరీ..
సాధారణంగా దొంగలు వాహనం లాక్ తీయడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ చోరీలో దొంగ అత్యంత తెలివిగా వ్యవహరించాడు. బాధితుడు బండి ఆపి షాపులోకి వెళ్లే సమయంలో దొంగ అప్పటికే అక్కడ రెడీగా ఉన్నాడు. కేవలం 15 నుంచి 20 సెకన్ల వ్యవధిలో బండిని స్టార్ట్ చేసి మాయమయ్యాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఫుటేజ్ చూస్తుంటే.. దొంగలు ఎంత పక్కా ప్లాన్‌తో ఉన్నారో అర్థమవుతోంది.
పోలీసుల చర్యలు..
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెళ్లిన మార్గంలోని ఇతర కెమెరాలను కూడా పరిశీలించారు. పాత నేరస్తుల రికార్డులతో నిందితుడి పోలికలను సరిపోలుస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బాలాపూర్ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. నిమిషం లోపు పని అయిపోతుంది కదా అని బండికి తాళం వేయకుండా లేదా అజాగ్రత్తగా వదిలేయడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దానం నాగేందర్ కేసు విచారణ.. పాడి కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే?
పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్
Read Latest Telangana News And AP News And Telugu News