పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:26 PM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.
హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) విచారణ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.
సమయం ఇవ్వండి: మహేశ్వర్ రెడ్డి
ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు.
ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా... నేడు దానంను స్పీకర్ విచారిస్తున్నారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.
ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
దానం నాగేందర్ కేసు విచారణ.. పాడి కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే?
Read Latest Telangana News And Telugu News