నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
ABN , Publish Date - Jan 30 , 2026 | 09:37 AM
జాబ్ క్యాలెండర్‌పై కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే గణనీయంగా ఉద్యోగ భర్తీలు చేపట్టిన విషయం తెలిసిందే.
అమరావతి, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం (AP Govt) శుభవార్త చెప్పనుంది. జాబ్ క్యాలెండర్‌పై కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వివిధ శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తోంది సర్కార్. పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల వారీగా భర్తీ చేయ్యాల్సిన ఉద్యోగాల వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే గణనీయంగా ఉద్యోగ భర్తీలు చేపట్టిన విషయం తెలిసిందే.
మెగా డీఎస్సీ ద్వారా ఇప్పటికే 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. కేవలం 150 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి టీచర్ల నియామకాలు విజయవంతంగా పూర్తి చేసింది. అలాగే 6 వేల కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అన్ని శాఖల్లో ఖాళీల జాబితాను సేకరించి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సర్కార్ కసరత్తు ప్రారంభించింది.
ఆర్థిక శాఖపై పడే భారం, ఉన్న ఖాళీలు అన్నీ బేరీజు వేసుకుని ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగ యువతకు భారీ ఊరట కలిగించే అంశం. త్వరలోనే అధికారిక ప్రకటనలు రావాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
హోంగార్డు ఉద్యోగం.. అక్రమాస్తులు 20 కోట్లు
Read Latest AP News And Telugu News