బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:06 AM
కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్, జనవరి 30: కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..?
కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా సమ్మక్క జాతర వేడుకగా సాగుతోంది. ఈ జాతరకు గురువారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబసమేతంగా భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. దాంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలనే అనుమతి ఇస్తామని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. దాంతో పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగి.. తన కుటుంబసభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను హెచ్చరించారు. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. తనను అడ్డుకుంటే సంగతి చెబుతానంటూ బెదిరింపులకు దిగారు కౌశిక్ రెడ్డి. దీంతో పోలీసులు, కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి వీణవంకకు వెళ్లారు. వీణవంక జాతరలో దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు సూచించారు. పోలీసుల సూచనను ఆయన బేఖాతరు చేశారు. దాంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మరోవైపు వీణవంకలో సమ్మక్క జాతర ట్రస్టీ ఉదయానందరెడ్డి వర్గానికి, కౌశిక్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ జాతరకు కౌశిక్ రెడ్డి వస్తే.. ఘర్షణ జరిగే ఆస్కారం ఉందని పోలీసులు భావించారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
సల్లంగ చూసేందుకు సమ్మక్క వచ్చె!
For More TG News And Telugu News