సల్లంగ చూసేందుకు సమ్మక్క వచ్చె!
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:30 AM
తన భక్తుల మీద వరములు చిలకరించేందుకు చిలుకలగుట్ట నుంచి కదిలివచ్చింది సమ్మక్క తల్లి! తనను నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరమికొట్టి, వారిని సల్లంగ చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మేడారం గద్దెపై ఆసీనురాలైంది.
చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి చేరుకున్న వనదేవత
మేడారం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తన భక్తుల మీద వరములు చిలకరించేందుకు చిలుకలగుట్ట నుంచి కదిలివచ్చింది సమ్మక్క తల్లి! తనను నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరమికొట్టి, వారిని సల్లంగ చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మేడారం గద్దెపై ఆసీనురాలైంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించిన భక్త జనులు ఆనందపారవశ్యంతో ‘జై సమ్మక్క.. జైజై సమ్మక్క’ అంటూ జయజయధ్వానాలు చేశారు. ఇలా రెండోరోజైన గురువారం మేడారంలో అత్యంత కీలక ఘట్టం పూర్తవ్వడంతో మహాజాతర పతాకస్థాయికి చేరింది. డోలూ సన్నాయి వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ సరిగ్గా రాత్రి 9:47 గంటలకు సమ్మక్క గద్దెపైకి చేరుకుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు బుధవారమే గద్దెలపైకి చేరుకున్నారు. సమ్మక్క రాకతో నలుగురు దేవతలు ప్రభుత్వం ఆధునికీకరించిన గద్దెలపై కొలువుదీరడంతో జాతర పరిపూర్ణతను సంతరించుకుంది. సమ్మక్కను గద్దెపైకి చేర్చే కార్యక్రమంలో గిరిజన పూజారులు తెల్లవారుజాము నుంచే నిమగ్నమయ్యారు. తెలతెలవారుతుండగానే మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకొని ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పేడతో చక్కగా అలికి.. తోరణాలు కట్టి.. ముగ్గులు వేశారు. అడవికి వెళ్లి వనాన్ని తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు డప్పుచప్పుళ్ల మధ్య వనాన్ని తీసుకొస్తుండగా సమ్మక్క గుడి సమీపంలో బొడ్రాయి వద్ద మహిళలు నీళ్ల బిందెలతో ఎదురొచ్చి పూజారుల కాళ్లు కడిగారు. మంగళహారతులు పట్టారు. వనం తీసుకువచ్చే కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మధ్యాహ్నం పూజారి సిద్దబోయిన మునేందర్ ఇంట్లో ఆడేరాలను (పసిడి కుండలు) సిద్ధం చేశారు. డోలు వాయిద్యాల మధ్య వాటిని సమ్మక్క గుడికి తరలించారు. గుడిలో తల్లికి సంబంధించిన మిగతా పూజా సామగ్రిని శుద్ధి చేశారు. పూజల అనంతరం మేకలు, కోళ్లను బలిచ్చారు. అనంతరం సాయంత్రం ఐదింటికి ప్రధాన పూజారి అయిన కొక్కెర కృష్ణయ్య, మరో ఆరుగురు పూజారులు మాల్యాల సత్యం, సిద్దబోయిన మునీందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్.. చిలుకల గుట్టకు బయలుదేరారు.
గుట్టపైకి కొంత దూరం వెళ్లాక ప్రధాన పూజారి మిగతా వారు ఆగిపోగా.. కృష్ణయ్య ఒక్కరే గుట్ట పైభాగాన తల్లి స్థావరం వద్దకు వెళ్లారు. అక్కడ సుమారు రెండు, మూడు గంటల పాటు ఆయన రహస్య పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తల్లి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరారు. మార్గమధ్యలో వేచివున్న మిగతా పూజారులతో కలిసి కిందకు బయలుదేరారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్, ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌తో పాటు వేలసంఖ్యలో భక్తులు ఎదురుచూస్తుండగా భరిణ రూపంలో ఉన్న సమక్కతో పూజారులు వచ్చారు. సమ్మక్కతల్లి రాకను పురస్కరించుకొని, ఆ తల్లికి గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ సుధీర్ ఏకే 47తో గాల్లోకి నాలుగు రౌండ్లు పేల్చి వందనం సమర్పించారు. అనంతరం చిలుకల గుట్ట ప్రధాన ద్వారం వద్ద మరోదఫా మూడు రౌండ్లు గాల్లోకి పేల్చి తల్లి వస్తున్నట్టుగా భక్తులకు సంకేతాలు పంపారు. సమ్మక్కను పూజారులు మార్గమధ్యలో మేడారంలోని ఆమె గుడికి తీసుకువెళ్లారు. అక్కడ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమ్మక్కను అక్కడి నుంచి తరలివస్తుండగా తల్లిని దర్శించుకునేందుకు దారి పొడవునా వేలాది మంది భక్తులు బారులు తీరి నిల్చున్నారు. పూజారులతో పాటు గద్దెల వరకు వెంటనడిచారు. సమ్మక్క రాక సందర్భంగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. పూజారులు తల్లిని గద్ద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు. కరెంట్ సరఫరాను కూడా బంద్ చేశారు. సమ్మక్కను గద్దెపై నిలిపిన తర్వాత పది నిముషాల పాటు రహస్య పూజలు నిర్వహించి వెనుదిరిగిన తర్వాత తల్లి దర్శనానికి అనుమతిచ్చారు.




