మేడారం.. మినీభారతం!
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:27 AM
జాతర కదా... వరంగల్ జిల్లా కేంద్రానికి వంద కి.మీ దూరంలో.. కనీసం వంద గడపలు కూడా లేని కుగ్రామమైన మేడారం సహజంగానే లక్షలమంది భక్తులతో జనసంద్రంగా మారింది.
ఉత్తర, దక్షిణ భారతాలను కలిపిన మహాజాతర
మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచీ భక్తులు
మేడారం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జాతర కదా... వరంగల్ జిల్లా కేంద్రానికి వంద కి.మీ దూరంలో.. కనీసం వంద గడపలు కూడా లేని కుగ్రామమైన మేడారం సహజంగానే లక్షలమంది భక్తులతో జనసంద్రంగా మారింది. అయితే ఉత్తర, దక్షిణ భారత ప్రజలను ఏకం చేస్తూ ఈ మహాజాతర మినీ భారతాన్ని తలపిస్తోంది. జాతరకు తెలంగాణ, ఏపీ నలుమూలల నుంచే కాదు.. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తల్లుల దర్శనానికి కలిసి వెళుతున్నారు. మేడారం హైటెక్ గ్రామంగా మారింది. మునుపు మేడారం జాతరలో సెల్ సిగ్నల్స్ వచ్చేవి కాదు. ఇప్పుడు అన్ని నెట్‌వర్క్‌లూ పనిచేస్తున్నాయి. 5జీ సేవలతో ఇంటర్‌నెట్టూ పనిచేస్తుండటం భక్తులకు గొప్ప ఊరటనిస్తోంది. ఆధునిక సౌకర్యాలు కోరుకునే భక్తుల కోసం హైటెక్ గుడారాలు వెలిశాయి. వేడివేడిగా భక్తులకు అల్పాహారం అందిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ పేరుతో చాలాచోట్ల స్టాళ్లు వెలిశాయి. పిల్లల కోసం ఆఫ్రికన్ సర్క్‌సలు, జెయింట్ వీల్స్, తోలు బొమ్మలు, వాటర్ గేమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మహాజాతరలో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువే గానీ.. నాటు సారా నుంచి వైన్, రమ్, బ్రాందీ, విస్కీ, బీరు, స్కాచ్, వోడ్కా తదితర అన్ని రకాల మద్యం జాతరలో లభిస్తోంది.