హోంగార్డు ఉద్యోగం.. అక్రమాస్తులు 20 కోట్లు
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:40 AM
పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగం.. నెలకు రూ.24 వేలకు మించని జీతం.. కీలకమైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో విధులు..
15 ఏళ్లుగా ఏసీబీలో విధులు
అవినీతి అధికారుల నుంచి భారీగా లబ్ధి
ఏసీబీ దాడుల్లో అక్రమాస్తుల గుర్తింపు
విజయనగరం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగం.. నెలకు రూ.24 వేలకు మించని జీతం.. కీలకమైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో విధులు.. అయితే అవినీతికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన ఆ చిరుద్యోగి అక్రమార్జనకు తెరతీశాడు. దాదాపు రూ.20 కోట్లకుపైగా అక్రమాస్తులు పోగేశాడు. 15 ఏళ్లుగా ఆయన సాగిస్తున్న అక్రమాలు ఇటీవల బయటపడడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి అక్రమాస్తుల వివరాలు సేకరించారు.
నెట్టి శ్రీనివాసరావు 2010లో ఏపీలోని విజయనగరం పోలీ్‌సశాఖలో హోంగార్డుగా చేరాడు. అప్పటి నుంచి 2025 వరకు విజయనగరం ఏసీబీ కార్యాలయంలో పనిచేశాడు. ఏసీబీ అధికారులకు అందే సమాచారం, లంచం తీసుకుని పట్టుబడే కేసులు, అక్రమాస్తుల వివరాలను తెలుసుకుని చేయబోయే దాడుల గురించి సంబంధిత అధికారులకు ముందే సమాచారం అందించేవాడు. దీనికి బదులుగా వారి నుంచి భారీగా నగదు లేదా ఇళ్ల స్థలాల రూపంలో తీసుకునేవాడు.
ఏసీబీ అధికారులకు అనుమానం వచ్చి శ్రీనివాసరావు కదలికలపై నిఘాపెట్టారు. ఏడాది క్రితం అతన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపివేశారు. అప్పటి నుంచి ఏసీబీ అధికారులు శ్రీనివాసరావు గురించి పూర్తి సమాచారం సేకరించారు. గురువారం దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.20 కోట్లు ఉంటుందని సమాచారం.