Share News

మహాత్ముడివి మూడు బాధలు!

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:28 AM

సత్యమే దేవుడని నమ్మిన మహామనిషి మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. మన దేశపు భిన్నత్వంలోని ఏకత్వాన్ని మనసా వాచా కర్మణా నమ్మి ప్రజల మధ్య వైషమ్యాలు లేని సమైక్య భారతావనిని...

మహాత్ముడివి మూడు బాధలు!

సత్యమే దేవుడని నమ్మిన మహామనిషి మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. మన దేశపు భిన్నత్వంలోని ఏకత్వాన్ని మనసా వాచా కర్మణా నమ్మి ప్రజల మధ్య వైషమ్యాలు లేని సమైక్య భారతావనిని కలగన్న దార్శనికుడు. ఆయన సంప్రదాయవాది కాదు, అదే సమయంలో అభ్యుదయవాదీ కాదు. కేవలం ఇంగిత జ్ఞానంతో పనిచేసిన ఒక ఆదర్శవాది. గాంధీని జీవితాంతం బాధించిన విషయాలు ప్రధానంగా మూడు ఉన్నాయి. ఒకటి, హిందూ ముస్లిం ఐక్యత లేకపోవడం. రెండు, దళితులు అభ్యున్నతి పొందకపోవడం. మూడవది, దరిద్ర నారాయణుల్ని పేదరికం నుంచి బయట పడవేయలేకపోవడం. గాంధీ రచనలన్నిటా ఈ విషయాలే కీలకంగా ఉంటాయి. ‘‘నేను నమ్మే సిద్ధాంతాలు, ఆదర్శాలు వ్యాప్తిలో ఉన్నంత కాలం, మరణానంతరం సైతం జీవించే వుంటాను’’ అని చెప్పారాయన. 20వ శతాబ్ది రాజకీయ నాయకుల్లో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన నాయకుడు గాంధీ. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే విలువలతో ప్రపంచవ్యాప్తంగా నైతిక రాజకీయానికి మార్గదర్శిగా నిలిచాడాయన.

దేశ స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు గడిచాక నేడు, గాంధీని హత్య చేసిన గాడ్సేను కీర్తిస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు భారతజాతి నైతికత మీద దాడి చేయడమే. అన్ని జాతులు, మతాలు కలగలిసి సమైక్యంగా జీవించాలనే ఆకాంక్ష కోసం ఆయన చెల్లించిన మూల్యం– ప్రాణం. ప్రజాస్వామ్యంలో హింసను, హత్య చేసిన వారిని కీర్తించడం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే. దేశానికి గాంధీ లేకున్నా స్వాతంత్య్రం వచ్చేదేమో కానీ, గాంధీ ఐడియాలజీ లేకుండా దేశం ఇంతటి ప్రశాంతతను పొందేది కాదు. మార్టిన్ లూథర్‌కింగ్ అమెరికాలో నల్ల జాతీయులకు హక్కులు సాధించినా, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు స్వాతంత్య్రం తెచ్చినా... మహాత్ముడి అహింసా మార్గమే వారికి ఆదర్శం.


గాంధీ సత్యాగ్రహం అంటే– తనను తాను ఆత్మపరిశీలన, ఆత్మ పరివర్తన చేసుకోవడం. మనిషిలో హింస, కోపం, అహంకారం, ద్వేషం ఉన్నప్పుడు ఇతరులకు మార్గదర్శిగా నిలవడం నైతికంగా సరైంది కాదని ఆయన నమ్మారు. ఇదే గాంధీ సత్యాగ్రహానికి పునాది. తనతో తాను నిజాయితీగా ఉండకపోతే, సత్యం కోసం సమాజంతో పోరాడే నైతిక హక్కు ఉండదని నమ్మారు. చౌరీ–చౌరా సంఘటనలో హింస జరిగిందని, తాను నైతికంగా సమాజాన్ని అహింస వైపు నడిపించడంలో విఫలమయ్యానని భావించి ఉద్యమాన్ని ఆపేశారు. ఇది గాంధీలోని ఆత్మపరిశీలనకు ఒక గొప్ప తార్కాణం. అలాగే గాంధీ దృష్టిలో ధర్మం అంటే– సత్యం, అహింస, నైతికతపై ఆధారపడిన జీవన విధానం. ధర్మం– వ్యక్తిగత, సామాజిక రాజకీయ రంగాలన్నిటిలోనూ నైతిక బాధ్యతను సూచిస్తుంది. వ్యక్తికీ– వ్యక్తికీ, వ్యక్తికీ– సమాజానికీ, సమూహానికీ– సమూహానికీ మధ్య సంబంధాలను నిర్వచించే విలువగా ధర్మాన్ని ప్రస్తావించారు. గాంధీ దృష్టిలో సన్యాసి అంటే అంతర్ముఖ నైతికత, సామాజిక బాధ్యత, బాహ్యజీవన రీతిగా ఆచరించేవారు; ముఖ్యంగా బలహీనుల పక్షాన నిలబడే ఆధునిక వేదాంతి; సమాజం నుంచి పారిపోయేవారు కాదు, ఒక నైతిక పోరాట యోధుడు.

స్వదేశీ గురించి విస్తృతంగా ప్రచారం చేసిన గాంధీ... కేవలం దేశీయ వస్తువుల వాడకం, విదేశీ వస్తువుల బహిష్కరణ మాత్రమే కాదు. దానిని ఒక సామాజిక, ఆర్థిక కార్యక్రమంగా ముందుకు నడిపారు. ఖద్దరు ఉత్పత్తి, సత్యాగ్రహం, రైతు ఉద్యమాలు, దేవాలయ ప్రవేశాలు ఇవన్నీ కూడా ప్రజలను కుల, మత రహితంగా ఐక్యం చేయడానికి ఉద్దేశించిన కార్యాచరణలు. తోటి మానవుల పట్ల ప్రేమ, దయ, గుణాలతో వ్యవహరించడం, మానవసేవే మాధవ సేవగా ఆచరించడం... గాంధీ దృష్టిలో సనాతనం. గాంధీ సనాతనవాదం ఏ విషయాలపైనా మొండిగా వ్యవహరించదు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతుంది. ‘‘నా హిందూయిజం ఎవరినీ వెలివేయదు. అన్ని తరగతులను కలుపుకుపోయే సమగ్రతా సిద్ధాంతం’’ అంటారు గాంధీ.


అస్పృశ్యతకు వ్యతిరేకంగా గాంధీ పెద్ద యుద్ధం చేశారు. హిందూ శాస్త్రాల భావం సమానత్వాన్ని ప్రసాదించేదే తప్ప అస్పృశ్యతను ప్రోది చేసేది కాదని పలు సందర్భాల్లో అన్నారు. ‘హరిజన’ పేరుతో ఒక పత్రికను స్థాపించి, అహింసా సిద్ధాంతానికి అస్పృశ్యత విరుద్ధమని చాటారు. సాటి మనిషిని తక్కువగా, అవమానకరంగా చూడడం భగవద్గీత సందేశానికి కూడా వ్యతిరేకమని హిందూ సమాజాన్ని హెచ్చరించారు. హిందూ మతంలో అంతర్గత సంస్కరణల కోసం పోరాటం చేసిన చిట్టచివరి నాయకుడు మహాత్మాగాంధీ. సత్యమే దేవుడని నమ్మిన ఆయన దైవాన్వేషణలో ఎవ్వరూ మతం మారాల్సిన అవసరం లేదని చెప్పారు.

గాంధీ లేకుండా స్వాతంత్య్రోద్యమాన్ని, అంబేడ్కర్ లేకుండా భారత రాజ్యాంగాన్ని, నెహ్రూ లేకుండా ఆధునిక భారతాన్ని ఊహించలేం. వీరి ఆలోచనలు, ఆచరణ భారతీయ మూలాల నుంచి ఉద్భవించాయి. ఇటీవల మహాత్ముడిని తక్కువ చేస్తూ వస్తున్న పెడధోరణులు గాంధీ వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నాలు. పౌర సమాజం ఈ పోకడలను గుర్తించి, ప్రజలను వాస్తవికత వైపు నడిపించాల్సిన ఆవశ్యకత ఉంది.

డొక్కా మాణిక్య వరప్రసాద్

మాజీ మంత్రి

(నేడు మహాత్మాగాంధీ వర్ధంతి)

ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 30 , 2026 | 02:28 AM