రేపు సిట్ విచారణకు కేసీఆర్..
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:30 PM
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిట్ (SIT) విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కఠ నెలకొంది. అయితే, సిట్ నోటీసులపై న్యాయ నిపుణులతో దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ విస్తృత మంతనాలు జరిపారు. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. విస్తృత చర్చల అనంతరం ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు..
ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో నందినగర్‌లోని తన నివాసంలోనే సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ రోజు(శనివారం) రాత్రి లేదా రేపు(ఆదివారం) ఉదయం హైదరాబాద్‌కు కేసీఆర్, పార్టీ ముఖ్య నేతలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని.. ఇంటి వద్దే విచారించాలన్న నిబంధనను దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ తన ఇంట్లోనే అధికారులకు అందుబాటులో ఉండనున్నారు.
కీలక సమావేశం తర్వాతే నిర్ణయం..
సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేసీఆర్ తన ముఖ్య అనుచరులు, న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. న్యాయవాదుల బృందంతో సమావేశమై, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన తర్వాత.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులకు అందుబాటులోకి రానున్నారు.
రాజకీయ ప్రాధాన్యత..
కేసీఆర్ నివాసం ముందు గోడపై నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి సిట్ అధికారులు నోటీసులు అంటించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా విచారణకు సహకరించడం ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు ధీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News