జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
ABN , Publish Date - May 08 , 2026 | 10:29 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైల్వేజోన్ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ప్రశ్నించారు.
విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ (MP Sri Bharat) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైల్వేజోన్ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ప్రశ్నించారు. ఈరోజు (శుక్రవారం) విశాఖపట్నంలో శ్రీభరత్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అండ్ కోకు పరిపాలన అంటే ఏమీ తెలియదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయకపోయినా.. ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మాత్రం అన్ని చేయాలని అంటారని ఎద్దేవా చేశారు.
జూన్ నుంచి రైల్వేజోన్ కార్యకలాపాలు..
జూన్ ఒకటి నుంచి రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రైల్వేజోన్‌కు గెజిట్ నోటిఫికేషన్ రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైల్వేజోన్ రావడమే కాదని.. విశాఖ డివిజన్ కూడా వచ్చిందని ప్రస్తావించారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పార్టీ వైసీపీ అని విమర్శించారు. జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిదీ తామే తెచ్చామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొవడం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి లక్ష కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
వాల్తేర్ డివిజన్ విశాఖ డివిజన్‌గా రూపాంతరం..
రైల్వేజోన్ ఏర్పాటు చేసేటప్పుడు అనేక అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటారని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. జోన్ రావడం వల్ల విశాఖపట్నం నుంచి పలు రైళ్లు మొదలవుతాయని.. మరిన్ని రైళ్లను కేంద్రాన్ని అడగవచ్చని అన్నారు. తాత్కాలిక రైల్వేజోన్ జీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ కార్యాలయాన్ని సందర్శించారని అన్నారు. వాల్తేర్ డివిజన్ విశాఖ డివిజన్‌గా రూపాంతరం చెందిందని చెప్పారు. రాజమండ్రి - విశాఖ లైన్‌ను రూ.10వేల కోట్లతో నిర్మిస్తున్నారని తెలిపారు. రైల్వేలు, పోర్టులు అనుసంధానం జరిగితే రాష్ట్ర వాణిజ్యం మరింత అభివృద్ధి అవుతుందన్నారు. 90 శాతం పలు రాష్ట్రాలు కలిసిన ఏకైక జోన్.. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో మాత్రమే ఉందని వివరించారు. రెన్యువల్ ఎనర్జీ, ఆర్సీలార్ స్టీల్ అనకాపల్లికి వచ్చాయని తెలిపారు. విశాఖలో నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ అభివృద్ధి అవుతుందన్నారు. విశాఖ గూగుల్ సమీపంలోనే స్థలాలు కావాలని అనేక సంస్థలు కోరుతున్నాయని అన్నారు.
మరిన్ని పరిశ్రమలు వస్తాయి..
ఏపీలో డేటాసెంటర్లు మొదటి అడుగు మాత్రమేనని.. మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఎంపీ శ్రీ భరత్ చెప్పుకొచ్చారు. పోలవరం త్వరగా పూర్తి అవుతోందని.. విశాఖకు పొలవరం ద్వారా నీళ్లు వస్తాయని తెలిపారు. 30 టీఎంసీల నీరు విశాఖకు వస్తుందని.. అందులో ఒక టీఎంసీ గూగుల్‌కి ఇస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వస్తే.. రాష్ట్రానికి ఆదాయం వస్తుందని.. భోగాపురంలో రెండువైపులా రాకపోకలు చేయొచ్చని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద నాలుగు పెద్ద హోటల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ నుంచి బెంగళూరు వారానికి ఒకసారి సర్వీస్ ఉందని.. ఇప్పుడు రోజు నడిపే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తనకు రాజకీయం కంటే విశాఖనగర అభివృద్ధి ముఖ్యమని ఉద్ఘాటించారు. మొన్న వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో పశ్చిమబెంగాల్‌కు పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నానని అన్నారు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ అత్యధిక స్థానాలు సాధించినందుకు ఎంపీ శ్రీ భరత్ అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు
పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు
ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News