పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 07 , 2026 | 11:26 AM
అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని పేర్కొన్నారు.
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. అధికారులు సమష్టిగా పనిచేసి.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలను వందశాతం పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశారు. ఏపీని పునఃనిర్మిస్తామని తాను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అందరి సహకారంతో రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని.. ఇది సమష్టి విజయమని ఉద్ఘాటించారు. ఈ అవార్డు తనకు బాధ్యతతో కూడినది అని.. నిజానికి ఇలాంటి అవార్డులు పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తాయని వ్యాఖ్యానించారు. మీ అందరి సహకారంతోనే తనకు ఈ అవార్డు వచ్చిందని అన్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారని… ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారనే దానికి ఈ అవార్డు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. మంత్రులు, సీఎస్ మొదలుకుని... గ్రామస్థాయి అధికారి వరకు పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తీసుకువచ్చాం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్టుబడులను ఏపీకి తీసుకురాగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. గ్రీన్‌ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రూ.23లక్షల కోట్ల ఎంవోయూలు పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే జరిగిన ఎంవోయూల ద్వారా 24లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. దేశంలోని అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. వారానికో కంపెనీ తీసుకొస్తున్నామని.. రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
ఆ నిధులు డైవర్ట్ చేశారు..
ఏపీ వారసత్వంగా రూ.9,74,000 కోట్లు అప్పుగా వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ హయాంలో కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీముల నుంచి రూ. 10వేల కోట్లు డైవర్ట్ చేశారని ధ్వజమెత్తారు. దీంతో వారు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. రూ.1,30000 వేల కోట్లు అప్పలు చెల్లించకుండా ఉంచేశారని మండిపడ్డారు. ఈ కాన్పురెన్స్‌కు రెండు జిల్లాల నుంచి కొత్తగా కలెక్టర్‌లు వచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల మ్యాండేట్ నిన్న కూడా చూశామని... సరిగా పనిచేయకపోతే ప్రజలు ఆదరించరని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా ఈ సమావేశానికి రాలేకపోయారని... తాము ఇద్దరం కలిసి ఇచ్చిన హమీలు నేరవేర్చాల్సి ఉంటుందని చెప్పారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లు ఏపీలో ఏమాత్రం అభివృద్ది లేకపోయినా ఇప్పడు చాలా వరకూ ట్రాక్‌లో పెట్టగలిగామని అన్నారు. ఆర్థిక అసమానతలు పరిష్కరించి జీవన ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
డబ్బును సృష్టించి పనులు చేయించాలి..
ప్రజాప్రతినిధులు, అధికారుల కలయికే కూటమి ప్రభుత్వమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో డెలివరీ లీకేజిలు ఎక్కువగా ఉండేవని... ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్తున్నాయని వివరించారు. జగన్ హయాంలో ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రోడ్ల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు కలెక్టర్ రిపోర్టు పంపేవారని.. అయితే వారు ఇప్పుడు పంపక్కరలేదని... తామే పంపిస్తామని అన్నారు. ప్రజాసమస్యలు అన్నింటిని పాజిటివ్‌గా పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవస్ధను మ్యానేజ్ చేయడానికి కాదని.. దాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం ఉందని తెలిపారు. డబ్బు లేదనేది నిజం కాదని... డబ్బును సృష్టించి పనులు చేయించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News