జగన్.. మావిగన్ అంటూ.. అమరావతిని అపహాస్యం చేశారు: ఎంపీ శివనాథ్
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:03 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ అంటూ అమరావతిని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు.
విజయవాడ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (MP Kesineni Sivanath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ అంటూ అమరావతిని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని అవమానించేలా జగన్ తీరు ఉందని ఆగ్రహించారు. జగన్ తానా అంటే తందానా అని చెప్పుకునే నాయకులు రెడీ అయ్యారని విమర్శించారు. ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావు జగన్ అయితే... అతని చుట్టూ చిడతలు వాయించే వారు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని ఓ నాయకుడు తమ మీద విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీలోని ఓ నేత తండ్రి.. టీడీపీ గురించి ఎంత గొప్పగా చెప్పారో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. అమరావతి రాజధాని గురించి ఒక్కసారి ఆయన.. తన తండ్రి మాటలు వినాలని సూచించారు. ఏపీ రాజధాని అమరావతి కావడం ద్వారా విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
తిరువూరును అభివృద్ధి చేస్తున్నాం..
అలాగే, తిరువూరు వివాదంపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తిరువూరు అభివృద్ధి తమ హయాంలోనే జరుగుతుందని తెలిపారు. వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. తాను ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నట్లు కొంతమంది ఆరోపణలు చేశారని.. తనకు ఇక్కడ ఎవరితో ఆర్థిక పరమైన లెక్కలు లేవని స్పష్టం చేశారు. దేవదత్ అనే వ్యక్తి తిరువూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని ప్రస్తావించారు. తిరువూరు ప్రజలకు సేవ చేసేందుకు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టారని అన్నారు. తనకు ఎలాంటి డబ్బులు ఆ వ్యక్తి ఇవ్వలేదని... ఇంకెవరికైనా ఇచ్చారేమో పరిశీలించాలని సూచించారు. గిరి అనే ఎన్ఆర్ఐ వ్యక్తి ఎన్నికల సమయంలో టీడీపీ విజయం కోసం డబ్బు ఖర్చు పెట్టారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ విజయం కోసం విస్సన్నపేటలో ఆయన పని చేశారని ప్రస్తావించారు.
నాకు ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు..
తనకు వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా గిరి ఇవ్వలేదని ఎంపీ కేశినేని శివనాథ్ తేల్చిచెప్పారు. తనకు ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేవదత్ మూడు నెలల క్రితం తనను కలిసి.. తన ఆస్పత్రి నిర్వహణ ఇబ్బందిగా ఉందని చెప్పారని అన్నారు. తాను తన వంతుగా సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చానని తెలిపారు. ఓ ఛానల్ వారు ఇష్టం వచ్చినట్లుగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాస్తే మంచిదని హితవు పలికారు. ఇక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికా.. ఓ బురద పత్రికా అని ఎద్దేవా చేశారు.
ఆ పత్రిక నాపై విషం చిమ్ముతునే ఉంది..
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫోన్ ట్యాపింగ్ తాను చేసినట్లు రాశారని.. తనపై నిత్యం సాక్షి పత్రికా విషం చిమ్ముతునే ఉందని ఆగ్రహించారు. తన గురువు, మార్గదర్శి అయిన సుజనా చౌదరి ఫోన్‌ను తాను ఎందుకు ట్యాపింగ్ చేస్తానని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఆ పత్రికా నిరూపించాలని.. తాను తప్పు చేసి ఉంటే అరెస్టు చేయించాలని సవాల్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసికట్టుగా దేశం, రాష్ట్రం కోసం పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత ఏపీ సాధించి తీరుతామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News