అడ్డుపడటం.. ఆపడం.. ఔను.. అంతా జగనే చేశారు!
ABN , Publish Date - Jul 31 , 2026 | 06:43 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్‌ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్‌పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్‌పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.
నాడు.. భోగాపుర పర్వంలో వైసీపీ సైంధవ పాత్ర
నేడు.. ‘అంతా నేనే చేశా’ అంటూ మాయ మాటలు
కొత్త విమానాశ్రయ నిర్మాణ ఆలోచన చంద్రబాబుదే
2019లో శంకుస్థాపన.. 80శాతం భూ సేకరణా పూర్తి
విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన జగన్
అడ్డుకుంటామని ప్రకటనలు, గేలి వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు కాలయాపన
మరో ఏడాదిలో ఎన్నికలనగా మళ్లీ శంకుస్థాపన
గద్దెదిగే నాటికి పూర్తయిన పనులు 26 శాతమే
కూటమి వచ్చాక రెండేళ్లలోనే పూర్తిస్థాయి నిర్మాణం
ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ పోర్టు ఎందుకు సార్...
ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నంపూట ఈగలు తోలుకుంటున్నారు! ఇంక.. భోగాపురం ఎందుకు?
కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు కూడా వేసి భోగాపురం ఎయిర్‌పోర్టును ఆపే కార్యక్రమం చేద్దాం!
2019లో అధికారంలోకి రాకముందు, విపక్ష నేతగా వైఎస్ జగన్ భోగాపురం విమానాశ్రయంపై వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలివి!
శనివారం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతోంది. ఇప్పుడు అదే జగన్ ఏమంటున్నారంటే... ‘ఎయిర్‌పోర్టు క్రెడిట్ మొత్తం నాదే! పని మాదైతే.. ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారు’! అని! ‘ఓహో.. ఇందులో ఇసుమంతైనా నిజం ఉండొచ్చేమో! అధికారంలోకి వచ్చి, మనసు మార్చుకుని భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను జగనే పరుగులు తీయించారేమో!’ అని పొరపాటుగా అయినా అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే!
వారి కోసమే ఈ కథనం!
జగన్ మాటల్లో నిజమెంతో మీరే తేల్చండి!
అప్పుడేం జరిగింది...
విశాఖపట్నంలోని విమానాశ్రయం తూర్పు నౌకాదళం ఆధీనంలో ఉంది. అక్కడ రక్షణ అవసరాలకే ప్రాధాన్యం! నౌకాదళ అధికారులు అనుమతించిన వేళల్లో, పరిమితి మేరకే పౌర విమానాల రాకపోకలు సాగుతాయి. ఈ నేపథ్యంలో... విశాఖకు ప్రత్యేకంగా అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించారు. 2014లో హుద్‌హుద్ తుఫాను తాకిడికి విశాఖ ఎయిర్‌పోర్టు తీవ్రంగా దెబ్బతింది. రన్‌వేపైకి వరదనీరు చేరింది. రాడార్ వ్యవస్థ దెబ్బతింది. విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు రోజుల తరబడి విశాఖలో ఉండిపోయి సాధారణ పరిస్థితులు వచ్చేవరకూ పర్యవేక్షించారు. అదే సమయంలో... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఆలోచన మరింత బలపడింది.
శంకుస్థాపనకు ముందే...
ఏ ప్రాజెక్టులోనైనా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ... భూ సేకరణే! భోగాపురం విమానాశ్రయానికి 2703 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఊరికే గుర్తించి ఊరుకోలేదు... అందులో 80 శాతం భూమిని రైతుల నుంచి సేకరించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించింది. వైసీపీ నేతల మాటలు విని కోర్టులకు వెళ్లినవారు, ఇవ్వడానికి వెనుకంజ వేసిన రైతులకు సంబంధించిన 20 శాతం భూములు మాత్రం మిగిలాయి. భూములు ఇచ్చిన నాలుగు గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా అప్పుడే ఇచ్చారు. జీఎంఆర్‌తో నిర్మాణ ఒప్పందం కూడా చంద్రబాబునాయుడు హయాంలోనే జరిగింది. ఇదంతా పూర్తయ్యాకే... 2019 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది ఉత్తుత్తి భూమిపూజ కాదు. పనులు మొదలుపెట్టడమే తరువాయి.
ఐదేళ్లలో జగన్ చేసిందేమిటంటే...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్‌ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్‌పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్‌పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు. వైసీపీ నేతలే కేసులు వేయించారు. 2019లో జగనే ముఖ్యమంత్రి అయ్యారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 80 శాతం భూమి చేతిలో ఉన్నా పట్టించుకోలేదు. జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో... మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా, కొన్ని అనివార్య పరిస్థితుల్లో... 2023 మే 3న భోగాపురం విమానాశ్రయానికి జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు. జీఎంఆర్‌తో మళ్లీ ఒప్పందం చేసుకున్నారు. సేకరించిన భూమిలో 500 ఎకరాలు వెనక్కి లాక్కున్నారు. విమానాశ్రయ పనులు పరుగులు పెట్టించాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి అవసరమైన అనుమతులు కేంద్రం ఇవ్వాలి కాబట్టి ఆ ప్రక్రియను మాత్రమే జగన్ ప్రభుత్వం చేసింది.మొత్తానికి జగన్ గద్దెదిగేనాటికి అయిన పనులు కేవలం 26 శాతం!
మళ్లీ కూటమి వచ్చాక...
2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే.. అంటే, 2024 జూలై 11న భోగాపురం వెళ్లి పనులను పరిశీలించారు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండడంతో పనుల వేగవంతానికి దోహదపడ్డారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణతో కాంట్రాక్టు సంస్థ కూడా ఈ పనులను సీరియ్‌సగా తీసుకుంది. ఈ రెండేళ్లలో సమీక్షలు, తనిఖీలు ప్రతి నెలా చేయడం వల్లఅనుకున్న సమయం కంటే ముందుగానే నిర్మాణం పూర్తయిందనేది వాస్తవం. రెండేళ్లలో ఒక అపార్ట్‌మెంట్ నిర్మాణం కూడా పూర్తికాని పరిస్థితులు! అలాంటిది... భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే... భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ సీఎం చంద్రబాబే! జగన్ చేసింది... విపక్షంలో ఉండగా అడ్డుకోవడం! అధికారంలోకి వచ్చాక... పనులను పడకేయించడం!
-విశాఖపట్నం/ విజయనగరం - ఆంధ్రజ్యోతి
ఇవీ నిజాలు...
జగన్ వాదన: ఎన్నికలకు ముందు ఒక రాయి వేయడం మినహా చంద్రబాబు ఏమీ చేయలేదు.
వాస్తవం: భోగాపురం స్థలం ఎంపిక, అక్కడ భూసేకరణ అంతా చంద్రబాబే చేశారు. శంకుస్థాపన చేసే నాటికి 80 శాతం భూసేకరణ కూడా పూర్తయింది.
జగన్ వాదన: నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు రూ.1,200 కోట్లు ఖర్చు చేశాం.
వాస్తవం: విమానాశ్రయం కోసం మారాడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెం, రెల్లిపేట గ్రామాలను తరలించాల్సిన పరిస్థితి. మొదటి రెండు గ్రామాల్లో 256 కుటుంబాలకు లింగాలవలసలో పునరావాసం అంతకుముందే ఖరారు చేశారు. మిగిలిన రెండు గ్రామాల్లో 120 కుటుంబాలకు గూడెపువలసలో లేఅవుట్ వేశారు. వారికి అక్కడ నివాసానికి ఏర్పాట్లు మాత్రమే చేశారు.
జగన్ వాదన: కొవిడ్ పరిస్థితులు ఎదుర్కొంటూనే 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయం రన్‌వే పనులు కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ పనులు కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం.
వాస్తవం: జగన్ భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి 2023 మే నెలలో శంకుస్థాపన చేశారు. అంటే, సీఎం అయ్యాక దాదాపు నాలుగేళ్లు కాలక్షేపం చేశామని చెప్పకనే చెప్పారు. అక్కడి నుంచి ఏడాది కాలంలో ఎన్నికలు జరిగి ఓడిపోయారు. ఆ మధ్య కాలంలో... పనులు పరుగులు పెట్టించడం, రన్‌వే పూర్తి చేయడం, టెర్మినల్ పనులు కూడా ముందుకు తీసుకువెళ్లడం... అన్నీ అవాస్తవమే. టెర్మినల్ భవనానికి స్లాబు మాత్రమే వేశారు. అదీ పూర్తిగా కాదు. మొత్తంగా జగన్ హయాంలో 26శాతం పనులు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
‘నాపై నమ్మకంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఇంతటి భారీ విజయాన్ని అందజేశారు. మీ ఆదరణ, నాపై ఉంచిన నమ్మకం ఎన్నటికీ మరిచిపోలేను. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మీకు మాట ఇస్తున్నా!’
- 2024 జూలై 11న భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించేందుకు వచ్చినపుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News