స్టాన్‌ఫర్డ్‌లో చదివింది నేను.. పేపర్ లీక్ చరిత్ర జగన్‌ది.. లోకేశ్ సెటైర్లు
ABN , Publish Date - May 27 , 2026 | 12:39 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేశారని ధ్వజమెత్తారు.
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేశారని ధ్వజమెత్తారు. జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితోనే కదా చంపారు... అందుకే వైసీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నామని విమర్శించారు. గత మహానాడులో 6 శాసనాలు ప్రవేశపెట్టామని.... వీటిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈరోజు (బుధవారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు వేడుకల్లో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు.
డీఎస్సీపై చేసే కుట్రలను తిప్పి కొట్టాలి..
గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని.. జగన్ అండ్ కో డీఎస్సీపై చేసే కుట్రలను తిప్పి కొట్టాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. డీఎస్సీని అడ్డుకోవాలని వైసీపీ నేతలు చూశారని ధ్వజమెత్తారు. ‘నీది పదోతగరతి పేపర్ లీక్ చేసిన చరిత్ర.. నాది స్టాన్‌ఫర్డ్‌లో చదివిన చరిత్ర. బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్ సైకో. టీచర్లను మేము సింగపూర్ పంపిస్తే.. నువ్వు మద్యం షాపుల ముందు కాపలా పెట్టావ్’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకువచ్చాం..
నిజం గడపదాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీలో సంస్కరణలు తీసుకురావడానికి ఎంతగానో పోరాడామని తెలిపారు. జిల్లాస్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయికి పార్టీ ఎదుగుదలకు చాలా పోరాటం చేశామని చెప్పుకొచ్చారు. ఒక మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవిని, ధనుంజయ్‌లను పొలిట్‌బ్యూరోలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడా కూడా గేట్లను తాళ్లతో కట్టలేదని తేల్చిచెప్పారు. చిన్నచిన్న సమస్యలు ఉండొచ్చని.. వాటిని నాలుగు గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించారు. 151 సీట్ల నుంచి 11 స్థానాలకు వైసీపీ ఎలా వచ్చిందో చూశామని.. ప్రజల దగ్గరకు టీడీపీ నేతలు వెళ్లాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరం..
ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని... అందరూ ఈ విషయాన్ని ఆలోచించాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 1983లో టీడీపీని ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. 1982లో ఏపీ, బిహార్ తలసరి ఆదాయం ఒకేలాగా ఉండేదని.... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు తెచ్చిందని ప్రస్తావించారు. తెలుగుదేశం వరుసగా అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పుకొచ్చారు. ఏపీలో నమో అంటే నాయడు... మోదీ జోడీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తనకు అండగా పవన్ కల్యాణ్ నిలిచారని ప్రస్తావించారు. చంద్రబాబు జైలుకు వెళ్తున్నప్పుడు తొలిసారిగా పవన్ ఫోన్ చేశారని గుర్తుచేశారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉండటంతోనే విశాఖ ఉక్కు, రైల్వేజోన్ సాధించామని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచి తెస్తామని, రాయలసీమకు ఫైటర్ జెట్ పరిశ్రమ తీసుకువచ్చామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News