Share News

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 27 , 2026 | 10:50 AM

విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు.

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.


సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసింది..

1875 క్లస్టర్‌ల వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని ప్రశంసించారు. పశ్చిమాసియా యుద్ధవాతావరణం మూలంగా మహానాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు’ అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసిందని ప్రస్తావించారు. జెండర్ ఈ క్వాలిటీ, సామాజిక సమస్యలపై తెలుగుదేశం పోరాడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


కార్యకర్తల్లో జోరు తగ్గలేదు..

వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ... కార్యకర్తల్లో జోరు మాత్రం తగ్గలేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల మహానాడును హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని వివరించారు. మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదని అన్నారు. భవిష్యత్తు గురించి అన్ని విషయాలు చర్చించుకుందామని తెలిపారు. కూడు, గూడు, నీడ లాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించిందని ప్రస్తావించారు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసమని ఉద్ఘాటించారు. ప్రతీ ఒక్కరికీ తెలుగుదేశం జెండా చూస్తేనే నమ్మకం, భరోసా కలుగుతోందని తెలిపారు. నాటికి, నేటికి టీడీపీపై ప్రజలకు ఆదరణ చెక్కు చెదరలేదని చెప్పారు. 45 ఏళ్లుగా ప్రజాసమస్యల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.


చంద్రయ్య స్పూర్తి కలకాలం నిలుస్తుంది..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజా పోరాటాలు ఆపలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘వైసీపీ హయాంలో నరహంతకులు పీకలు కోస్తున్నా.. టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వీడలేదు. చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించి అమరుడయ్యారు. ఆయన స్పూర్తి కలకాలం నిలుస్తోంది. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, లోకేశ్ యువగళాన్ని అడ్డుకున్నారు. మన నేతలను అరెస్టు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా టీడీపీ వెనకడుగు వేయలేదు. ప్రజాస్వామ్యం కోసం టీడీపీ నిలిచింది. ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నాం. మహిళా సాధికారిత, సామాజిక, ఆర్థిక రాజకీయ గౌరవం కోసం టీడీపీ పనిచేస్తోంది. ఆస్తి హక్కు నుంచి.. నేడు తల్లికి వందనం వరకూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ టీడీపీ వారి వెనుక ఉంటుంది. ఒకప్పడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చాం. ఇది చూసే నా చిన్నప్పుడు ఇష్టంగా నడిపిన రాయల్ ఎన్‌ఫిల్డ్ కూడా రాష్ట్రానికి వచ్చింది. 1875 ప్రాంతాల్లో మహానాడు హైబ్రిడ్ సమావేశం జరుగుతోంది. ఏ తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలిపారో రియల్ టైంలో వస్తున్నాయి. బెస్ట్ టెక్నాలజీ ప్లస్‌ని ఇక్కడికి తెస్తామని యువతకు విజ్జప్తి చేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ

కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 27 , 2026 | 11:21 AM