కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - May 26 , 2026 | 11:25 AM
రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravi Kumar) వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఏపీలో అక్కడక్కడా తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. ఈరోజు (మంగళవారం) సచివాలయంలో మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. 48 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
యుద్ధప్రాతిపదికన చర్యలు..
ఎక్కడైనా ఒక ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించటానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలోనూ ప్రాణాలు పణంగా పెట్టి విద్యుత్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని చెప్పారు. సత్తెనపల్లిలో ఇద్దరు సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారని.. ప్రజలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈదురుగాలులకు హోర్డింగ్‌లు, విద్యుత్ తీగల మీద పడి కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. అనుమతులు లేని హోర్డింగ్‌లు తొలగించేందుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని అన్నారు.
విద్యుత్ వినియోగం పెరిగింది..
అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క సబ్‌స్టేషన్ కూడా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టిందని ప్రస్తావించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని.. అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్‌మిషన్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీలో నిమిషం కూడా విద్యుత్ కోత లేదని అన్నారు. సబ్‌స్టేషన్లు పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. సెప్టెంబరులోపు 30 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News