Share News

గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం

ABN , Publish Date - May 25 , 2026 | 11:10 AM

గోదావరి పుష్కరాల-2027 ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం
Pawan Kalyan

రాజమండ్రి, మే 25 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల-2027 (Godavari Pushkaralu 2027) ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, అందుకు తగిన విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.


నాణ్యతతో పనులు చేయాలి..

ఈ సమావేశంలో అధికారుల పనితీరుపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది వ్యవధిలో రూ.8,600 కోట్లతో చేపట్టాల్సిన పనులకు ఇంకా డీపీఆర్‌లు ఎందుకు సిద్ధం కాలేదని ప్రశ్నించారు. ఒకే సంవత్సరంలో 7 వేల పనులను ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. ముఖ్యంగా పుష్కరాల నిర్వహణలో టూరిజం శాఖ నుంచి సరైన సన్నద్ధత ఎందుకు కనిపించడం లేదని మందలించారు. ఇష్టానుసారంగా ఖర్చు పెడదామని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా, నాణ్యతతో పనులు చేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. హడావిడిగా పాచిపోయిన సిమెంట్‌తో పనులు చేస్తే అవి కూలిపోతాయని హెచ్చరించారు. గత పుష్కరాల్లో జరిగిన తోక్కిసలాట వంటి ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.


భక్తులకు సమాన సౌకర్యాలు కల్పించాలి..

గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రికే పరిమితం కాదని, 6 జిల్లాల్లోని 274 పంచాయతీల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో భక్తులకు సమాన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల పనుల సన్నద్ధతపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చిస్తామని వెల్లడించారు. కేంద్ర నిధుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వెళ్లే సమయంలో అన్నివిధాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. గోదావరి నదిలో భక్తులు మురికినీళ్లలో స్నానం చేయడం సరికాదని పేర్కొన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గోదావరి పుష్కరాలను విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


కాలుష్య నివారణకు కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలి..

అలాగే, తూర్పుగోదావరి జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గోదావరి నది కాలుష్యానికి కారణాలపై పవన్ ఆరా తీశారు. క్లీన్ కృష్ణా, గోదావరి మిషన్ పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమ వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవకూడదని హుకుం జారీ చేశారు. పరిశ్రమ వ్యర్థాలపై పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలుషిత నీరు సాగునీటి కాలువల్లో కలవకుండా చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. మురుగునీటిని శుద్ధి చేశాకే నదులు, కాలువల్లో కలపాలని సూచించారు. మురుగునీరు హాట్ స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని నిర్దేశించారు. కాలుష్య నివారణకు కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీల్లో మురుగునీరు ఎందుకు శుద్ధి చేయట్లేదని ప్రశ్నించారు. మురుగునీటిని నేరుగా పంట కాలువల్లో ఎందుకు కలిపేస్తున్నారని నిలదీశారు. నదిలో, తాగునీటిలో మురుగునీటిని కలపడం సరికాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 11:24 AM