ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలి: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:58 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు.
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రోడ్లపై తిరగుతూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ కంటే పెద్ద వేదిక జగన్‌కు ఏదైనా ఉందా..? అని ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో హోం మంత్రి అనిత మాట్లాడారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా జగన్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. ఎమ్మెల్యేల హక్కులను జగన్ కాలరాస్తున్నారని ఆగ్రహించారు. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.
జగన్‌కు డీఎస్సీ అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదు..
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేని జగన్‌కు.. డీఎస్సీ అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదని అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే డీఎస్సీపై తొలి సంతకం చేసిందని తెలిపారు. సుమారు 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. డీఎస్సీ అభ్యర్థుల కష్టాన్ని అవమానించేలా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు. డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సమాధానం ఇచ్చారని అన్నారు.
వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు..
కోర్టుల్లోనూ వైసీపీ నేతల ఆరోపణలకు ఎదురుదెబ్బలు తగిలాయని అనిత ప్రస్తావించారు. ప్రజల్లో అలజడి సృష్టించేందుకే వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ వెనుక వైసీపీ నేతల భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. లోకేశ్‌ను రాజకీయంగా బద్నాం చేయడమే జగన్ లక్ష్యమని విమర్శించారు. లోకేశ్ నాయకత్వంలో పారదర్శకంగా పాలన అందిస్తున్నామని వెల్లడించారు. 16 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చి గౌరవంగా ఉద్యోగాల్లోకి పంపామని చెప్పుకొచ్చారు. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించామని ప్రస్తావించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో వైసీపీ నేతలు రాజకీయాలు చేయొద్దని హోం మంత్రి అనిత హితవు పలికారు.
వార్తలు కూడా చదవండి...
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News