సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:05 AM
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు తల్లిని అవమానించే విధంగా అంబటి మాట్లాడారని ఆగ్రహించారు. మహిళా లోకం కూడా ఆయన వ్యాఖ్యలను సహించదని తెలిపారు. సోమవారం ఢిల్లీ వేదికగా మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు.
కర్తవ్య స్ఫూర్తిని కొనసాగించేలా బడ్జెట్..
వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు పురందేశ్వరి. కర్తవ్య స్ఫూర్తిని కొనసాగించేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధి కోసం 350 సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దేశాన్ని నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని ఉద్ఘాటించారు. పేదరికం నుంచి 25 కోట్ల మందిని బయటకు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధులు..
పోలవరం ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం రూ.500 కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. అమరావతిలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించింది. పోలవరం, అమరావతికి కలిపి రూ.3800 కోట్ల వరకు నిధులు వచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రాండ్‌గా రాష్ట్రాలకు నిధులు వస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లోనూ జిల్లాల ప్రస్తావన ఉండదు. కానీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల వారీగా కాకుండా మంత్రిత్వ శాఖలకు కేటాయింపులు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రులను దృష్టిలో ఉంచుకుని.. అక్కడి పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేలా బడ్జెట్ ఉంది. ప్రపంచ అవసరాలకు సరిపడేలా మన దేశంలో యువత ఉన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి జిల్లాలో మహిళలకు హాస్టల్స్ ఏర్పాటు చేస్తుంది. సంప్రదాయ విజ్ఞానం కొనసాగించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు’ అని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.
పర్యాటక రంగానికి పెద్దపీట..
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఎంపీ తెలిపారు. ‘చేనేత వృత్తులకు ప్రోత్సాహం కల్పించేలా ఓడీఓపీ ద్వారా చేతివృత్తుల వారికి లాభం చేకూరుతుంది. రాజమండ్రి, కాకినాడతో సహా నగరాల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కొబ్బరి, కోకో, జీడి మామిడి రైతులకు ప్రోత్సాహం అందించేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కొబ్బరి, కోకో ఉత్పత్తిలో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉంది. అనంతపురంలో మోనోజైట్ నిక్షేపాలు ఉన్నాయి. శ్రీకాకుళం, నెల్లూరులో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే మినరల్స్ ఏపీలో ఉన్నాయి. వికసిత భారత్ కావాలంటే వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలి.. వికసిత రాష్ట్రాలు కావాలి.. ఆ దిశగా కేంద్ర బడ్జెట్ ఉంది’ అని ఎంపీ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్
మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
Read Latest AP News And Telugu News