Harish Rao VS Revanth Government : అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తాం.. హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:20 PM
కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్రప్రభుత్వమని మాజీమంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.
హైదరాబాద్ ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Commission Report) మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో హరీష్‌రావు బ్రీఫింగ్ చేశారు. హరీష్‌రావు ప్రెజెంటేషన్ చూసేలా బీఆర్ఎస్ నేతలు జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాప్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారని... రాజకీయ జోక్యం ఎలా అవుతోందని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను హింసించాలనే ధోరణి తప్పా.. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు.
దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబడలేదని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబుపై కూడా కమిషన్లు వేశారని.. అవి నిలబడలేదని గుర్తుచేశారు. సర్ ఆర్థర్ కాటన్ మాదిరిగా.. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఉద్ఘాటించారు. తెలంగాణలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆక్షేపించారు. 650పేజీల రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని... నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్‌రావు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కేంద్రాన్ని తప్పుపట్టినట్లుందని విమర్శించారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వమని గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కుట్రతో జరిగిన వ్యవహారమని ఆరోపించారు. పోలవరం మూడుసార్లు కూలినా ఎన్డీఎస్‌ఏ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మేడిగడ్డకు మాత్రం ఎన్డీఎస్‌ఏ మూడు సార్లు వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయమని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ డిజైన్ చేసిన కాంగ్రెస్‌పైనే మెదట చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి హరీష్‌రావు.
కాళేశ్వానికి కేంద్రం ఇచ్చిన అనుమతులు చూపిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. మైక్ కట్ చేసి పారిపోకూడదని సవాల్ విసిరారు. కాళేశ్వేరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయకుండా ఎలా ఉంటారని.. కేసీఆర్ కూడా అదే చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా కేసీఆర్ సొంత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. సీడబ్ల్యూసీ అనుమతి, కేబినెట్ నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంస్థ కూడా మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టవచ్చని చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News