Share News

CM Chandrababu ON TDP Leaders: తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:20 PM

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

 CM Chandrababu ON TDP Leaders: తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
CM Chandrababu ON TDP Leaders:

అమరావతి, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు అధినేత పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దామని మార్గనిర్దేశం చేశారు. కనీసం ఏపీ వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.


కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటింటి వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు కూడా జీఎస్టీ తగ్గిందని... రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ధి జరగుతోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.


ఏపీకి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణలతో ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారని వివరించారు. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చేశామో వివరించామని పేర్కొన్నారు. అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన యోగా డే సక్సెస్ అయిందని గుర్తుచేశారు. అలాగే జీఎస్టీ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని... అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తారని.. ఇదేం ద్వంద్వ వైఖరి.. ఇది డ్రామా కాదా...? అని ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ కార్యకర్తలైనా, నాయకులైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు.


మంచి, చెడులను ప్రజలకు వివరించాలని మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ విధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామని నొక్కిచెప్పారు. ఏపీలో అనేక సమస్యలను పరిష్కరించామని స్పష్టం చేశారు. నేడు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విద్యుత్ కొనుగోళ్లల్లో సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని వివరించారు. ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై రూ.1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని వెల్లడించారు. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలను నెరవేర్చామని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ.. సీఎం చంద్రబాబు అభినందనలు

తిరుమలలో గరుడ సేవకు భారీగా భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2025 | 02:13 PM