‘సర్’ పేరుతో మోదీ సర్కార్ ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోంది.. హరీశ్‌రావు ధ్వజం
ABN , Publish Date - Jun 14 , 2026 | 06:51 PM
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
హనుమకొండ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ (SIR) పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై (SIR) మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు. ఈరోజు(ఆదివారం) హనుమకొండలో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘సర్’పై (SIR) కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ‘సర్’ పై చాలా జాగ్రత్తగా ఉంటేనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలపై కొట్లాడుతున్నాం..
కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ అధికారంలోకి రావాలని జనం అంటున్నారని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. చట్టాలు, పోలీసులు చేయలేని పనిని కల్యాణలక్మితో కేసీఆర్ చేశారని ప్రస్తావించారు. కల్యాణలక్ష్మితో బాల్య వివాహాలు ఆగిపోయాయని తెలిపారు. కేసీఆర్ సంక్షేమ పథకాల వెనక ఒక విజన్ ఉందని ఉద్ఘాటించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలపై రెండున్నరేళ్లుగా కొట్లాడుతున్నామని తెలిపారు. కార్యకర్తల అండదండలతోనే హైడ్రాలాంటి అరాచకాలపై పోరాడుతున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తల పిల్లల కోసం పుస్తకాలను పార్టీ నేతలు పంపిణీ చేయడం సంతోషకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేసులు పెడితే భయపడబోం..
‘హిట్లర్ చేసిన దురాగతాలకు జర్మనీ ప్రజలు ఇప్పటికీ క్షమాపణ చెబుతారు. కాంగ్రెస్ వాళ్లుకూడా రేవంత్ తప్పిదాలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక నియంత ఉంటే ఇక్కడొక నియంత ఉన్నారు. తెలంగాణలో కోట్ల రూపాయల బొగ్గు స్కాం జరిగింది. నన్ను భూపాలపల్లి బొగ్గుబావుల్లోకి వెళ్లనివ్వలేదు. బొగ్గు స్టాక్ ఉందా అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నోరు విప్పడంలేదు. అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నాపై పది కేసులు పెట్టారు. కేసులు పెడితే భయపడబోం. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే... విచారణ జరపకుండా... దొంగకు తాళంచెవి ఇచ్చినట్లుగా రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. వడ్ల కొనుగోళ్లు జరగక ముందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాడ్స్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ఉంటే యాభైఏళ్ల దాకా కాంగ్రెస్ మొలకెత్తదు. పోలీసులు అక్రమ కేసులు పెడితే ఊరుకోం. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్‌కు 88స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News