Share News

వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:16 PM

కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమ‌లు చేయాల‌ని త‌ల‌పెట్టిన వీబీజీ రాంజీ స్కీం ప‌ట్ల నిర‌స‌న తెల‌పాల‌ని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. త‌మ నిర‌స‌న తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు.

వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
Telangana Minister Seethakka

హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమ‌లు చేయాల‌ని త‌ల‌పెట్టిన వీబీజీ రాంజీ స్కీం ప‌ట్ల నిర‌స‌న తెల‌పాల‌ని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) పేర్కొన్నారు. త‌మ నిర‌స‌న తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. వీబీజీ రాంజీ స్కీంను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మాణం చేశామని ప్రస్తావించారు. ఈ లేఖ‌లో పొందుప‌ర్చాల్సిన అంశాల‌పై పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెష‌ల్ సీఎస్, క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజ‌న్, స్పెష‌ల్ క‌మిష‌నర్ శ్రీల‌క్ష్మీ, జాయింట్ క‌మిష‌న‌ర్ న‌ర‌సింహులు, ఇత‌ర అధికారుల‌తో ప్రజాభ‌వ‌న్‌లో మంత్రి సీత‌క్క ఈరోజు (శనివారం) స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హ‌మీకి అవ‌స‌ర‌మైన నిధుల్లో క‌నీసం 60 శాతం నిధులు కేంద్రం నుంచి రావాల‌న్నా నూత‌న స్కీంను అమ‌లు చేయ‌క తప్పదని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు నూత‌న ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తున్నాయ‌ని అధికారులు తెలిపారు.


కేబినెట్‌లో చ‌ర్చించిన తర్వాతే తుది నిర్ణయం..

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఇత‌ర రాష్ట్రాల్లో నూత‌న ప‌థ‌కంపై అవ‌లంభిస్తున్న విధానంపై సుదీర్ఘంగా చ‌ర్చించినట్లు తెలిపారు. నూత‌న ప‌థ‌కం అమ‌లుపై కేబినెట్‌లో చ‌ర్చించి తుది నిర్ణయం తీసుకుంటామ‌ని అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కాకుండా.. నార్మెటివ్ ప‌ద్ధతిలో ప‌ని దినాలు కేటాయించే విధానాన్ని స‌వ‌రించాలని కోరారు. వ్యవ‌సాయ సీజ‌న్‌లో 60 రోజుల పాటు ఉపాధికి బ్రేక్ ఇవ్వాల‌న్న క్లాజ్‌ను తొల‌గించాలని అన్నారు. పంట సీజ‌న్ కాలంలో వ‌ర్షాలు విస్తారంగా కురుస్తాయని వివరించారు. ఆ స‌మ‌యంలోనే వ‌న మ‌హోత్సవాలు, మొక్కలు నాటే కార్యక్రమాలను ఉపాధి హ‌మీ ద్వారా చేప‌డుతామని తెలిపారు.


60 రోజుల బ్రేక్ ఇవ్వడం సాధ్యం కాదు..

పంట సీజ‌న్‌లో ఉపాధికి 60 రోజుల బ్రేక్ ఇస్తే.. మొక్కలు నాడటం ఆగిపోతుందని మంత్రి సీతక్క తెలిపారు. అది కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన గ్రీన్ ఇండియా క్యాంపెయిన్‌కు విరుద్ధమని అన్నారు. ఆదివాసీ, కొండ ప్రాంతాల్లో పంట సీజ‌న్ 60 రోజులు కూడా ఉండ‌దని చెప్పారు. ఒకసారి ప‌నులు మొద‌లుపెట్టాకా.. 60 రోజుల బ్రేక్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ప్రస్తుత ఉపాధి హామీ విధానం నుంచి నూత‌న విధానంలోకి ఒక్కసారిగా మార‌డం క‌ష్టమని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల‌కు కాస్త వెసులుబాటు ఇచ్చేలా నూత‌న చ‌ట్ట అమ‌లును వాయిదా వేయాలని సూచించారు. అయితే త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో వీబీజీ రాంజీని అమ‌లు చేయాల్సి వ‌స్తే.. ఉపాధి కూలీల‌కు ఏలాంటి న‌ష్టం లేకుండా తాము చూస్తామని అన్నారు. అందుకనుగుణంగా జ‌రిగే న‌ష్టాన్ని రాష్ట్రం త‌రుపున భ‌ర్తీ చేసేందుకు ముసాయిదా రూపొందించాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో చ‌ర్చించిన త‌ర్వాత నూత‌న‌ప‌థ‌కం అమ‌లుపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 02:24 PM