Share News

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

ABN , Publish Date - May 06 , 2026 | 01:29 PM

సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్‌‌గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR

వరంగల్, మే 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్‌‌గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు. రూ. 50వేల కోట్ల రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని.. కానీ రూ. 12వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు(బుధవారం) వరంగల్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.


నా సవాల్ స్వీకరించాలి..

ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు... ఎగవేతల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ నేతలకు రైతన్నల ప్రతాపం చూపించే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యూవల్ సీఎం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ఒక్క ఊరిలోనైనా సంపూర్ణంగా చేసిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈ సవాల్‌ను రేవంత్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వీకరిస్తారో లేదో చెప్పాలని అన్నారు. సమ్మక్క - సారలమ్మ జాతరలో రూ.70 కోట్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను దండుపాళ్యం బ్యాచ్‌లా రేవంత్‌రెడ్డి అండ్ కో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఇన్నాళ్లూ చేసినవి తప్పుడు ఆరోపణలని తేలిపోయిందని.. ఇకపై ఆరోపణలు చేస్తే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. మేడిగడ్డను కాంగ్రెస్ నేతలు బాంబులు పెట్టి పేల్చేశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి బస్తాల్లో డబ్బులు మోసేది తెలుసు.. కానీ యూరియా బస్తాలు ఇచ్చేది మాత్రం తెలియదని కేటీఆర్ విమర్శించారు.


కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్..

బస్తాల్లో డబ్బులు మోసేది తెలుసు.. కానీ యూరియా బస్తాలు ఇచ్చేది తెలియదా అని కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలో బడేభాయ్ చెప్పినట్లుగా.. రాష్ట్రంలో చోటేభాయ్ ఆడుతున్నారని సెటైర్లు గుప్పించారు. రాహుల్‌గాంధీ గతంలో వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో సభ పెట్టారని ప్రస్తావించారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి నాడు మాట్లాడిన స్పీచ్ సభలో ప్రదర్శించామని.. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో 34హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రం, చిత్తుకాగితమని విమర్శించారు. ఒట్టుపెట్టి ఓట్లు అడిగి రేవంత్‌రెడ్డి నయవంచన చేశారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడ రైతు సదస్సు పెడితే అక్కడ మైగా రైతు మేళా పెట్టారని ఎద్దేవా చేశారు. అది మెగా రైతు మేళా కాదని.. దగా రైతు మేళా అని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫొటోలు పోలీసుస్టేషన్ల దగ్గర గోడలపై అతికించి... వీళ్లు దొంగలని రాయాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్.. కరోనా కంటే డేంజర్ అని సెటైర్లు గుప్పించారు. అన్నదాతలందరికీ రైతు బీమాను ఇవ్వని దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్

పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 06 , 2026 | 02:07 PM