పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం
ABN , Publish Date - May 05 , 2026 | 12:29 PM
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ, మే5 (ఆంధ్రజ్యోతి): ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఇటీవలే భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్ ఈరోజు (బుధవారం) ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని వారు ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
రాఘవ్ చద్దా ప్రధాన ఆరోపణలు..
రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాఘవ్ చద్దా, పంజాబ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరినందుకు తమను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ నివాసం వెలుపల ఆప్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే 'దేశద్రోహి' అని రాశారని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్ర గుప్తాకు చెందిన ఫ్యాక్టరీకి పంజాబ్ ప్రభుత్వం నీటి సరఫరాను నిలిపివేసిందని, ఇది పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేయడమేనని అన్నారు. తమను, తమ మద్దతుదారులను సోషల్ మీడియాలో బెదిరించడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీలను నియమించిందని రాష్ట్రపతికి వివరించారు.
అయితే, ఇటీవల ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు (రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని, స్వాతి మలివాల్) బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇది పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రభుత్వానికి, బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలకు మధ్య యుద్ధం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి తమను ఇబ్బంది పెడుతున్నారని రాఘవ్ చద్దా బృందం ఆరోపిస్తుండగా, ఇది ప్రజల తీర్పునకు ద్రోహం అని ఆప్ వాదిస్తోంది. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కఠంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది: బండి సంజయ్
బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం
వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News