Share News

అరచేతిలో ప్రచారాస్త్రం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:59 AM

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ మినహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.

అరచేతిలో ప్రచారాస్త్రం
Municipal Elections

  • పురపోరులో సామాజిక మాధ్యమాలకు ప్రాధాన్యం

  • స్మార్ట్‌ ప్రచారంతో దూసుకెళ్తున్న అభ్యర్థులు

వనపర్తి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ మినహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అభ్యర్థులు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా డిజిటల్‌ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్‌ మీడియాను ప్రధాన ఆయుధంగా మార్చుకుని స్మార్ట్‌ క్యాంపెయిన్‌‌కు శ్రీకారం చుట్టారు.


వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలపై ప్రచార వీడియోలు, పోస్టర్లు, వాయిస్‌ మేసేజ్‌లతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి, సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లకు చేర వేస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక అవగాహన ఉన్న యువకులతో ప్రత్యేక ప్రచార బృందాలను ఏర్పాటు చేసుకున్నారు.


తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రచారం..

డిజిటల్‌ ప్రచారంతో ఖర్చు తక్కువ కావడంతో పాటు, ఎక్కువ మంది ఓటర్లను చేరు కునే అవకాశం లభిస్తుండడంతో అభ్యర్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉండటం, దాదాపు కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ ఉండటం ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా మారింది. కంప్యూటర్‌, మొబైల్‌ సాయంతో రూపొందించిన సందేశాలను ఒకేసారి వేలాది మందికి పంపించే అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకోసం అభ్యర్థులు వార్డుల వారీగా ఓటర్ల వివరాలు, ఫోన్‌ నెంబర్లును సేకరించుకున్నారు. ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి, ప్రతీ రోజు ప్రచార సందేశాలు, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు లైవ్‌ వీడియోలు, వాయిస్‌ కాల్‌లతో ప్రచారం కొనసాగిస్తున్నారు.


పెరిగిన అభ్యర్థుల సంఖ్య..

వనపర్తి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో, ఒక్కో వార్డులో ముగ్గురి నుంచి ఐదుగురు వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. సదరు అభ్యర్థులు ప్రచారంలో భాగంగా కుల, వృత్తి సంఘాల నాయకులు, సభ్యులతో పాటు, స్థానిక పెద్దలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. కార్యకర్తలకు ఉదయం, సాయంత్రం హోటళ్లల్లో భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో మద్యం సిట్టింగ్‌లు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో 80 వార్డులకు గాను 497 మంది అభ్యర్థులు 812 నామినేషన్లను దాఖలు చేయడం పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 12:25 PM