ట్రావెల్ ఏజెన్సీ మోసం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:37 PM
కడప కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ట్రావెల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో అమాయక పర్యాటకులను నమ్మించి, విదేశీ గడ్డపై వారిని గాలికొదిలేసిన ఈ ఘటన బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కడప, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కడప కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ట్రావెల్ మోసం(Travel Scam) వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో అమాయక పర్యాటకులను నమ్మించి, విదేశీ గడ్డపై వారిని గాలికొదిలేసిన ఈ ఘటన బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కడప నగరానికి చెందిన 'గో న్యూ హాలిడేస్(Go New Holidays)' అనే ట్రావెల్ ఏజెన్సీ రామేశ్వరం, శ్రీలంక టూర్ ప్యాకేజీల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడి.. తీరా అక్కడికి వెళ్లాక పర్యాటకులను నట్టేట ముంచింది.
ఏం జరిగిందంటే..
కడప కేంద్రంగా ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఈ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతునట్లు బాధితులు గుర్తించారు. ఒక్కో పర్యాటకుని వద్ద సుమారు రూ.60 వేలు వసూలు చేసి, శ్రీలంక టూర్ ప్యాకేజీని ఖరారు చేశారు. శ్రీలంకలో తమ ప్రతినిధి రిసీవ్ చేసుకుంటాడని.. వసతి, భోజన సౌకర్యాలున్నీ తామే చూసుకుంటామని నమ్మబలికారు. బెంగళూరు నుంచి 11 మంది, హైదరాబాద్ నుంచి 40 మంది పర్యాటకులు శ్రీలంక చేరుకోగా.. అక్కడ వారిని పట్టించుకునే వారేలేకుండా పోయారు. ప్రస్తుతం వీరంతా అక్కడి లోకల్ ట్రావెల్ సంస్థల సాయంతో తలదాచుకుంటున్నారు.
బాధితుల ఆవేదన..
ప్రస్తుతం శ్రీలంకలో ఇబ్బందులు పడుతున్న బాధితులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ నెల 6న తిరుగు ప్రయాణం టికెట్లు బుక్ చేశారని.. అయితే నిందితుడు వాటిని ఎక్కడ రద్దు చేస్తాడోనని బాధితులు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి.. తాము సురక్షితంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
కఠిన చర్యలు..
కడప కేంద్రంగా పనిచేస్తున్న ‘గో న్యూ హాలిడేస్’ ట్రావెల్ ఏజెన్సీ మోసం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశీ టూర్ పేరుతో సామాన్యులను మోసం చేయడం తీవ్ర నేరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఉదయభాస్కర్ అనే వ్యక్తిపై ఏపీ ప్రభుత్వం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీలు టూర్లు ప్లాన్ చేసేటప్పుడు, ఆ సంస్థ రిజిస్ట్రేషన్ వివరాలు, గత ట్రాక్ రికార్డ్, పర్యాటకుల రివ్యూలను క్షుణ్నంగా పరిశీలించాలని బాధితులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్
మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
Read Latest AP News And Telugu News