కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:35 PM
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు.
ఖమ్మం జిల్లా, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని.. ఆయన పాదయాత్ర కాదని.. ఏం చేసినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ని క్షమించరని హెచ్చరించారు. కేసీఆర్.. అప్పులు చేసి ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పాదయాత్రకు ముందు మీ చెల్లి కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గత పదేళ్ల కేసీఆర్ హయాంలో ఏం చేశారని.. ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క లెక్కలతో సమాధానాలు అడుగుతుంటే కేసీఆర్ అండ్ కో సతమతమవుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేత సంతోశ్‌రావు ఎలా సంతోషంగా ఉన్నారో.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆనందం ఏంటో మీ దోపిడీ ఎంతో.. మీ చెల్లెలు కవిత చెబుతోందని సెటైర్లు గుప్పించారు. పదేళ్లు దోపిడీకి అలవాటు పడి నేడు పదవులు కోల్పోయి ప్రజల ఆగ్రహానికి గురై నేడు విలవిలలాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ అండ్ కో పిచ్చిమాటలు మాట్లాడుతూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.
కాంగ్రెస్‌ది ప్రధాన పాత్ర..
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమం ఈరోజు(మంగళవారం) జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కి ఎప్పుడూ అండగా నిలిచిందని ఉద్ఘాటించారు. బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న పీవీ నరసింహ రావు దేశ ప్రధాని అయ్యారని ప్రస్తావించారు. ఇది ఒక్క కాంగ్రెస్‌కే సాధ్యమని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలి..
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా వారికి నచ్చినట్లుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే.. కాంగ్రెస్ అడ్డుకుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ పోరాట ఫలితంగా కులగణన చేశారని ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్తలు కీలక పదవులు పొందారని అన్నారు. భట్టివిక్రమార్క చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయిందని ఉద్ఘాటించారు. ఖమ్మం గడ్డపై నిలబడి చెబుతున్నా.. వచ్చే ఎన్నిక కాదని.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చేతనైతే తమ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తాము నెరవేరుస్తున్నామని తెలిపారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ విజయం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News