Ramakrishna: ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి ట్రంప్.. రామకృష్ణ ఫైర్..
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:05 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఖమ్మం జిల్లా, జనవరి8 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (US President Donald Trump) సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ (CPI National Secretary Ramakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచాన్ని బెదిరించాలనే దుస్సాహసానికి ట్రంప్ పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తనను సంతృప్తిపరచాల్సిన బాధ్యత మోదీపై ఉందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అన్నారని ప్రస్తావించారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు నాయకత్వం ఇచ్చిన ఇండియా.. ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితికి ఎందుకు దిగజారిందని నిలదీశారు. మోదీ పాలనలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) ఖమ్మం జిల్లాలో రామకృష్ణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్‌కు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు రామకృష్ణ.
18న భారీ బహిరంగ సభ..
ఖమ్మం నగరంలో ఈ నెల 18వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ జాతీయ నాయకులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. 18వ తేదీన నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సంఘీభావంగా ఈ ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. సీపీఐ ఆవిర్భావం నుంచి పోరాటాల పంథా కొనసాగించిందని తెలిపారు. పేదలు, కార్మికుల హక్కుల కోసం ఎంతోమంది జైలుకు వెళ్లారని అన్నారు. దేశం కోసం సీపీఐ ఎన్నో త్యాగాలు చేసిందని ప్రస్తావించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోరాటాల గడ్డ ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఖమ్మంలో జాతీయ కౌన్సిల్ సమావేశం ఉంటుందని తెలిపారు. 20వ తేదీ వామపక్ష పార్టీల జాతీయ నాయకులు ఆహ్వానించి సెమినార్ ఏర్పాటు చేశామని అన్నారు. 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ సెమినార్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉందని వివరించారు. ఈ సెమినార్‌లో వామపక్ష పార్టీలు పాల్గొంటాయని వెల్లడించారు. వామపక్ష పార్టీలు దేశంలో ఇతర పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు రామకృష్ణ.
పోలవరం పూర్తిచేయడం చాలా సంతోషం...
పోలవరం ముంపు ప్రాంతాల మండలాల్లో ఈరోజు(గురువారం) సమావేశం ఉందని రామకృష్ణ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి 2027 మార్చి నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అందిస్తామని అంటున్నారని అన్నారు. పోలవరం పూర్తిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలవరం ఏర్పాటుకు త్యాగాలు చేసిన భూ నిర్వాసితుల పరిస్థితి గురించి మాట్లాడటం లేదని అన్నారు. ఆగస్టు నెల వస్తే ఆ మండలాల్లోనే గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు. 135 అడుగుల వరకు మాత్రమే సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ముంపు బాధితులను గాలికి వదిలేశారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ డిమాండ్ చేస్తోందని అన్నారు. మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆపరేషన్ కగార్‌ను సీపీఐ పార్టీ ఖండిస్తోందని తెలిపారు. తక్షణమే నక్సల్స్‌తో చర్చలు జరపాలని కోరారు. మావోయస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ కూడా బూటకమేనని, పట్టుకొచ్చి కాల్చి చంపారని ఆరోపణలు చేశారు. ప్రశ్నించే వాళ్లని అర్బన్ నక్సల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని రామకృష్ణ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News